27 నుంచి పాలీసెట్ స్లాట్ బుకింగ్ ప్రారంభం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణ సమీపంలోని శ్రీసంగమేశ్వర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు పాలీసెట్ తదితర పరీక్షల కౌన్సిలింగ్ కోసం హెల్ప్‌లైన్ మంజూరైందని ప్రిన్సిపాల్ మునిగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్, ఈసెట్, ఏపీ సెట్, ఐసెట్ తదితర తదితర పరీక్షల కౌన్సిలింగ్‌కు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 27న పాలీసెట్ మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియతో హెల్ప్‌లైన్ సెంటర్ ప్రారంభమవుతుందని తెలిపారు. పాలీసెట్‌కు అర్హత పొందిన విద్యార్థులు మొదటి విడత కౌన్సిలింగ్‌కు ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. 29 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకొని జూన్ 3 నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవాలని వివరించారు.
జూడో పోటీల్లో
విద్యార్థికి కాంస్యం
కొండపాక(గజ్వేల్): మండలంలోని జప్తినాచారం గ్రామానికి చెందిన విద్యార్థి చింతల హర్షిత్‌గౌడ్ రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. శనివారం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆ విద్యార్థిని సన్మా నించారు. స్థానిక తెలంగాణ మోడల్ స్కూలులో విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన క్రీడోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సీఎం కప్ జూడో 60 వెయిట్ విభాగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హర్షిత్‌గౌడ్ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పావని, సిద్దిపేట జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భరత్‌రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగార్జునసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పశువులకు వడదెబ్బ జాగ్రత్తలు
జిల్లా పశుసంవర్ధక అధికారి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ పాడి పఽశువులపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సిద్దిపేట జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోపాల కృష్ణమూర్తి తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాడిపశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, చల్లటి తాగునీరు అందించాలన్నారు. పశువుల పాకలపై తాటికమ్మలు, గడ్డి కప్పాలని, షెడ్ చుట్టూ గోనె సంచులు కట్టి వాటిని నీటితో తడపాలని సూచించారు. షెడ్‌లలో ఫ్యాన్‌లు, కూలర్లు పెట్టాలన్నారు. పశువుల దాణాలో తగినంత ఖనిజ లవణాల మిశ్రమాలను కలపాలని చెప్పారు. అత్యవసర సేవలకు 1962కు ఫోన్ చేసి సేవలు పొందాలన్నారు.
మట్టి అక్రమ రవాణా..
4 టిప్పర్లు పట్టివేత
వర్గల్(గజ్వేల్): అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను గౌరారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఆరోగ్యం కథనం ప్రకారం... శుక్రవారం రాత్రి గౌరారం పీఎస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా మట్టిలోడ్‌తో నాలుగు టిప్పర్లు కన్పించాయి. తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆరెపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా గండిమైసమ్మ ప్రాంతానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా మట్టి రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్‌ఐ హెచ్చరించారు.


