శాపమైన తండ్రి ముందు చూపు! | - | Sakshi
Sakshi News home page

శాపమైన తండ్రి ముందు చూపు!

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

● అన్నదమ్ముల పంతం.. తల్లి అంత్యక్రియలకు దూరం ● నాన్నను పెట్టిన చోటే అమ్మను పెట్టాం: కూతురు ● చివరి చూపు చూడలేదన్న బాధలో చిన్న కొడుకు

● అన్నదమ్ముల పంతం.. తల్లి అంత్యక్రియలకు దూరం ● నాన్నను పెట్టిన చోటే అమ్మను పెట్టాం: కూతురు ● చివరి చూపు చూడలేదన్న బాధలో చిన్న కొడుకు

చిన్నశంకరంపేట(మెదక్‌): దివ్యాంగుడైన చిన్న కుమారుడి రక్షణ కోసం తండ్రి చూపిన ముందు చూపు ఇప్పుడు శాపమైంది. మండలంలోని మండ లం భాగీర్థిపల్లికి చెందిన రెడ్డి నర్సయ్య, చంద్రమ్మ దంపతులకు కూతురు, ముగ్గురు కుమారులు. కాగా పెద్ద కుమారుడు భిక్షపతి మృతి చెందగా, నాగరాజు, గోపాల్‌, భిక్షపతి కుమారులు ఉన్నారు. అయితే ఇందులో గోపాల్‌ దివ్యాంగుడు భవిష్యత్‌లో బతుకుదెరువు కష్టమైతదని భావించిన తండ్రి ముందు చూపుతో అతడి పేరు మీదున్న మూడెకరాల్లో ఎకరం పొలం అతడికి రాశాడు. ఇప్పుడిదే వివాదంగా మారి ఉన్న మూడెకరాల భూమిని సమానంగా పంచాలనే పంతం తల్లి చంద్రమ్మ అంత్యక్రియలకు శాపంగా మారింది.

ఒకే చోట పెట్టామన్న తృప్తి..

మా అన్నదమ్ములు భూ వివాదంతో పంతానికి పోయిన్రు. కానీ నాన్నను బొందపెట్టిన చోటే అమ్మను పెట్టామని తృప్తి మిగిలింది. తమ్ముడు రాలేదనే బాధున్న.. నాన్న, అమ్మను ఒక చోట పెట్టామనే తృప్తి మిగిలింది. అన్నదమ్ములు భూ వివాదంతో నాన్నను ఒక చోట, అమ్మను మరో చోట బొంద పెట్టడం నచ్చలేదు. అందుకే తమ్ముడు నాగరాజును ఒప్పించి అమ్మ మృతదేహాన్ని భాగీర్థిపల్లికి తీసుకువచ్చాం. అన్నదమ్ముల భూమి పంచాయితీ ఇలాగే ఉంటే తాను వాటా అడగాల్సి వస్తది.

– పెంటమ్మ, మృతురాలి కూతురు

చివరి చూపునకు నోచుకోలేదు..

తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు సపర్యలు చేసి రుణం తీర్చుకున్నాననే తృప్తి ఉంది. కానీ చివరి చూపునకు నోచుకోలేదనే బాధ ఉంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాలే, అమ్మ చనిపోయిందని చెప్పినప్పుడు స్పందించలేదు అన్న. చివరికి తల్లి శవం తీసుకెళ్లి తనను అంత్యక్రియలకు దూరం చేశాడనే బాధ మరవలేకపోతున్నాను. నాన్న చూపిన ముందుచూపుతో నా పేరు మీద రాసిన ఎకరం పొలం.. ఇదే వివాదం అయితదని అనుకోలేదు. చివరికి ఇదే తనను తల్లి అంత్యక్రియలకు దూరం చేసింది. తన ముగ్గురు చిన్నారుల సహాయంతో అమ్మను కంటికి పాపలా చూసుకున్నా. అదే తృప్తితో మిగతా కార్యం పూర్తిచేస్తా.

– గోపాల్‌, మృతురాలి చిన్న కుమారుడు

Advertisement
 
Advertisement
Advertisement