● దొంగతనంగా చిత్రీకరించే యత్నం ● బంగారు పుస్తెలతాడు స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన సీపీ
సిద్దిపేటకమాన్: మహిళను హత్య చేసి, బంగారం కాజేసి..దొంగతనంగా చిత్రీకరించే యత్నం చేసిన కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించారు. నిందితురాలిని అరెస్టు చేశారు. శనివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలు వెల్లడించారు. అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ గ్రామంలో బోయిని కనకయ్య ఇద్దరు భార్యలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కనకయ్య మొదట రాజ్యలక్ష్మి అలియాస్ రాజవ్వ(48)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో రాధను రెండో వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం రాత్రి కనకయ్య హమాలి పనుల కోసం వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి పెద్ద భార్య రాజ్యలక్ష్మిపై దాడి చేసి, బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారని రెండో భార్య రాధ భర్తకు చెప్పింది. తీవ్ర గాయాలైన రాజ్యలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానంతో రెండో భార్య రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజ్యలక్ష్మి పెత్తనం చేస్తుందని, చాలా కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. రాజ్యలక్ష్మి మెడలో బంగారు పుస్తెలతాడు ఉందని, తనకేమో మాములు పసుపుతాడు ఉందని రాధ అసూయ పడేది. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, నిద్రిస్తున్న రాజ్యలక్ష్మి తల, మొహంపై రాధ కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసింది. మెడలోని బంగారు పుస్తెలతాడును చోరీ చేసి వంటింట్లో భద్రపర్చింది. కాగా ఘటనను దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. టీవీలో సీరియల్ చూసి హత్యకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకొని నిందితురాలు రాధను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ ప్రశాంత్ పాల్గొన్నారు.


