బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
న్యాల్‌కల్(జహీరాబాద్): ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని ముంగి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మోహీన్, సలీమా దంపతులు శుభకార్యానికి వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. సలీమా తన మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసుతో పాటు చెవుల కమ్మలు తీసి బీరువాల్లో పెట్టి తాళం వేసింది. ఇంట్లో బాగా వేడిగా ఉండటంతో ఇంటికి తాళం వేసి అందరూ మేడపై పడుకున్నారు. ఈ క్రమంలో రాత్రి గుర్తు తెయని వ్యక్తులు మేకుతో తాళాలను తీసి ఇంట్లోకి వెళ్లి బీరువాను పగులగొట్టకుండా అందులో ఉన్న ఆభరణాలు, రూ.4 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఎస్‌ఐ సుజిత్ ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీం, సిబ్బందితో వివరాలు సేకరించారు.
చేర్యాలలో ఇల్లు, మార్ట్‌లో..
చేర్యాల(సిద్దిపేట): తాళం వేసిన ఇంటితో పాటు ఓ మార్ట్‌లో చోరీ జరిగింది. ఈ ఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి కథనం ప్రకారం... పట్టణానికి చెందిన యాంసాని కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన పనిమనిషి యజమానికి సమాచారమిచ్చింది. వెంటనే వారు వచ్చి చూడగా కబోర్డులో దాచిన రూ.90వేల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. అలాగే రోడ్డు ప్రక్కనే ఉన్న శ్రీమార్ట్‌లో దొంగలు కౌంటర్‌లోని రూ.15వేల నగదును ఎత్తుకెళ్లారు. మరో మార్టు షట్టర్‌ను తీసేందుకు యత్నించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు.


