● ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి ● నైజీరియా ప్రతినిధులకు అంతర్జాతీయ విత్తన శిక్షణ
ములుగు(గజ్వేల్): ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న కారణంగా సేంద్రియ విత్తన ధ్రువీకరణకు అపారమైన అవకాశాలున్నాయని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని వర్సిటీలో సీడ్ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ అంశంపై తరాబ, ప్రసాద్ సీడ్స్ లిమిటెడ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 30 మంది నైజీరియా ప్రతినిధులకు అంతర్జాతీయ విత్తన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విత్తన రంగంలో ప్రపంచానికే పాఠాలు నేర్పిన తెలంగాణ రాష్ట్రం మోడల్‌గా ఆఫ్రికా దేశాలు విత్తన రంగంలో మరింత ప్రగతి సాధించవచ్చునని తెలిపారు. కూరగాయల విత్తనోత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానంతో అనేక విజయాలను సాధించిన విశ్వవిద్యాలయం అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. శిక్షణ అనంతరం నైజీరియా బృందం ప్రతినిధులు మండలంలోని క్షీరసాగర్ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ రైతులు అనుసరిస్తున్న కూరగాయల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విత్తనోత్పత్తి విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో నైజీరియా టీఏజీఐఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. జోషువా మార్కు మాకు, వ్యవసాయ శాఖ పర్మినెంట్ సెక్రటరీ అలీసారా సాబో డాంజుమా, సీఈఓ దిలీప్‌కుమార్, క్షీరసాగర్ సర్పంచ్ బాల్‌రెడ్డి, వర్సిటీ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


