● నిందితుడి అరెస్ట్ ● రూ.50 లక్షల బంగారం రికవరీ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్
పటాన్‌చెరు టౌన్: చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అమీన్‌పూర్‌లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. అమీన్‌పూర్ పరిధిలో హిల్‌టాప్ కాలనీలో నివసించే వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఏప్రిల్‌లో ఊరికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. అలాగే అమీన్‌పూర్‌లో మరో ఇంట్లో కూడా చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ సీఐ నరేశ్, క్రైమ్ సీఐ సత్యనారాయణ బృందం దర్యాప్తును ప్రారంభించింది. బాధితుడి ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలో నిందితుడిని గుర్తించారు. అనంతరం ఈనెల 16న ఎల్బీనగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నాగర్ కర్నూల్‌కు చెందిన మండ్ల శివ అలియాస్ ఎర్ర శివ ప్రస్తుతం మీర్‌పేట్‌లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అతడి వద్ద నుంచి 45 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ద్వారా శనివారం పోగొట్టుకున్న బంగారాన్ని బాధితులు వెంకటరమణకు బంగారం అందజేశారు. అనంతరం నిందితుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై మొత్తం 24 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కూలి పని చేసే శివ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఎస్‌ఐ ప్రభాకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.


