అక్కన్నపేట(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో జీల ఓదెయ్య పశువుల పాక వద్ద షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రెండెకరాల పశుగ్రాసంతో పాటు పొలంలో ఉన్న ఐదెకరాల గడ్డి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం పొంచి ఉందని భావించిన రైతులు పశువుల పాకలో ఉన్న పశువులను ఎల్లమ్మ గుడి మర్రిచెట్టు కింద కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే గ్రామపంచాయతీ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కృష్ణనాయక్, తిరుపతినాయక్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.
శివ్వంపేట(నర్సాపూర్): బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని నవాబుపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇంద్రేశంలో బాలుడు..
పటాన్‌చెరు టౌన్: పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా, అల్లదుర్గానికి చెందిన పోచయ్య బతుకుదెరువు కోసం వచ్చి ఇంద్రేశంలో ఉంటూ కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. అతడి కుమారుడు రాజు (17) ఈనెల 18న ఇంద్రేశం నుంచి పటాన్‌చెరుకు పని కోసం వెళ్తున్నానని చెప్పాడు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పనికోసం వచ్చి..
ఏగుంట(తూప్రాన్): పని కోసం వచ్చిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం ప్రకారం... రాజస్తాన్‌కు చెందిన విజేందర్ సింగ్ ఈనెల 1న చేగుంట జీవిక పరిశ్రమ క్వార్టర్స్‌కు వచ్చాడు. అదే రోజు సాయంత్రం అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అతడి ఆచూకీ తెలియక పోవడంతో పరిశ్రమ మేనేజర్ అశోక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● 64 కేసుల్లో ఏడుగురు నిందితులు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్‌అర్బన్: ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగితీగల(కాపర్ కాయిల్స్)ను చోరీ చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య కేసు వివరాలు వెల్లడించారు. రెంజల్ మండలం సాటాపూర్ బైపాస్ వద్ద గురువారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మూడు బైకులపై ఉన్న ఐదుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ లభించాయి. విచారించగా 64 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్‌ను చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. కాగా వీరు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్లలోని కాయిల్స్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. కాగా నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితుల్లో మెదక్ టౌన్‌కు చెందిన వనం సాయిలు, సారయ్య, బోధన్‌కు చెందిన వనం పోశెట్టి, మెదక్‌కు చెందిన ధన కిరణ్, దాసరి పోచయ్యగా గుర్తించారు. చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసిన బోధన్‌లోని రాకాసిపేటకు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, గూపన్‌పల్లికి చెందిన షేక్ మహబూబ్, మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప, తాయప్ప దంగల్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, మూడు బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.


