ట్యాంకర్‌, ఆటో ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌, ఆటో ఢీకొని మహిళ మృతి

May 23 2026 9:35 AM | Updated on May 23 2026 9:35 AM

నలుగురికి గాయాలు

కంది (సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన కంది పరిధిలోని కంది–శంకర్‌పల్లి రోడ్డుపై చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై మధుసూదన్‌ రెడ్డి కథనం ప్రకారం... సదాశివపేట మండలం నాగసాన్‌పల్లికి చెందిన అలివేణి(54) ఐదు రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో ఉంటున్న తమ కూతురు ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు ఉండడంతో కూతురు దుర్గ, అల్లుడు మల్లేశం, మనువడు అభి, మనవరాలు అక్షరను తీసుకొని శుక్రవారం నాగసాన్‌పల్లికి ఆటోలో బయలు దేరారు. ఈ క్రమంలో కంది పరిధిలో గల ఆర్డీఏ కార్యాలయం సమీపంలో కంది–శంకర్‌పల్లి రోడ్డుపై కాంక్రీట్‌ మిక్సింగ్‌ ట్యాంకర్‌ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అలివేణి అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు,అల్లుడు,మనుమడు, మనుమరాలుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో మెదక్‌ జిల్లావాసి..

భిక్కనూరు : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం... మెదక్‌ జిల్లా, నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన వీరబోయిన కార్తీక్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇస్సానగర్‌ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారులో ట్రాక్టర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శిరీష, ఒక కొడుకు,ఒక కూతురు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement