పాముకాటుతో విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో విద్యార్థి మృతి

May 23 2026 9:35 AM | Updated on May 23 2026 9:35 AM

నర్సాపూర్‌ రూరల్‌: పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎల్లాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌ రెడ్డి కథనం ప్రకారం... కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని పీర్ల తండాకు చెందిన నునావత్‌ రాజు, జ్యోతి దంపతులు, పెద్ద కుమారుడు మహేశ్‌(14), చిన్న కుమారుడు రాకేశ్‌తో కలిసి నర్సాపూర్‌ మండలం ఎల్లాపూర్‌లోని మామిడి తోటలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. రోజులాగే గురువారం రాత్రి భోజనం చేసి రూమ్‌ ఎదుట నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి పెద్ద కుమారుడు మహేశ్‌ కాలుకు ఏదో కరిచిందని తండ్రిని నిద్రలేపి చెప్పాడు. వెంటనే రాజు అదే మామిడి తోటలో పనిచేసే డ్రైవర్‌ సహాయంతో సంగారెడ్డి ఆస్పత్రికి బైక్‌పై తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాముకాటు వేయడం వల్లే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

ఏడుపాయల్లో నీటిలో మునిగి..

పాపన్నపేట(మెదక్‌): దుర్గమ్మ దర్శనానికి ఏడుపాయలకు వచ్చిన ఓ యువకుడు స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా నవాబ్‌పేటకు చెందిన కంకరి నాగరాజు(31)కు అపుడప్పుడు ఫిట్స్‌ వస్తుంటాయి. ఈ క్రమంలో ఏడుపాయల్లో చెక్‌ డ్యాం వద్ద స్నానం చేస్తుండగా నీటిలో మునిగాడు. అక్కడి నుంచి వెళ్తున్న భక్తులు, ఒడ్డున చెప్పులు, సెల్‌ఫోన్‌ ఉండటం చూసి అనుమానించి,ఇతరులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు వచ్చి వెతకగా మృతదేహం లభ్యమైంది.

Advertisement
 
Advertisement
Advertisement