మెడలోంచి బంగారు గొలుసు, కమ్మలు అపహరణ
అక్కన్నపేట(హుస్నాబాద్): నిద్రిస్తున్న మహిళపై కర్రతో ముఖం, తలపై దాడి చేసి బంగారు గొలుసు, కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మంచినీళ్లబండలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు ఇద్దరు భార్యలు. కనకయ్య హమాలీ పనికి కట్కూర్ గ్రామానికి వెళ్లి ఇంటికి రాలేదు. మరో భార్య రాధవ్వ బయటకు వెళ్లింది. దీంతో రాత్రి రాజలక్ష్మి(48)భోజనం చేసి ఇంట్లో పడుకుంది. ఇదే అదనుగా భావించిన దొంగలు నిద్రిస్తున్న ఆమైపె దాడి చేసి మెడలోంచి సుమారు 3తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. తరువాత ఇంటికి వచ్చిన రెండో భార్య రాధవ్వ తీవ్ర గాయాలతో మంచంపై ఉన్న రాజలక్ష్మిని చూసి చుట్టుపక్కల వాళ్లకు చెప్పింది. వెంటనే అంబులెన్స్‌లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. అయితే, మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడారా? లేదా వేరే ఎవరైనా హత్య చేసి దొంగతనంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా? అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. అలాగే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు.


