స్విమ్మింగ్ ఫుల్!
● రోబోటిక్స్, ఏఐతో పాటు పలు అంశాల్లో శిక్షణ
● జిల్లాలో 25 పాఠశాలల్లో 1500 పైగా విద్యార్థులు
● ఉక్కపోతతో ఉపశమనం
● చిన్నారులతో స్విమ్మింగ్‌పూల్‌లో కిటకిట
పటాన్‌చెరు: ఎండలు మండుతున్నాయి. చల్లదనం కోసం జనం పరితపిస్తున్నారు. చిన్నారులైతే మరీ ఎక్కువగా అల్లాడిపోతున్నారు. సెలవులున్నాయి కానీ ఆడుకునేందుకు మైదానాలు లేవు. అపార్ట్‌మెంట్‌లలో ఇరుగుపొరుగుతో కలసి ఆడుకుందామంటే అల్లరి చేస్తున్నారంటూ పెద్దల అరుపులు. దాంతో కొందరు తమ పిల్లలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలకు ఈత నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లను ఆశ్రయిస్తున్నారు. వేడి తక్కువగా ఉండే ఉదయం సాయంత్ర పూట స్విమ్మింగ్ పూల్‌లకు తీసుకెళ్లున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ముఖ్యంగా అమీన్‌పూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో డజనుకు పైగా స్విమ్మింగ్ పూల్‌లను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ప్లాట్లు అద్దెకు తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లను ఏర్పాటు చేశారు. వాటికి గిరాకీ బాగా పెరిగింది. పటాన్‌చెరు పట్టణం నుంచి కూడా ప్రజలు అమీన్‌ఫూర్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వస్తున్నారు. గతంలో తాము సాకి చెరువు, ఇతర చెరువుల్లో ఈత కొట్టే వాళ్లమని చెబుతూ.. ఇప్పుడు ఆ చెరువులు కాలుష్య క్యాసారాలుగా మారాయని దాంతో తాము తమ చిన్నారులను స్విమ్మింగ్ పూల్‌లకు తెస్తున్నామని పేర్కొంటున్నారు. స్విమ్మింగ్ పూల్‌లకు తరలివచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహాకుడు సత్య తెలిపారు.
దుబ్బాక: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ఆలోచనతో ప్రభుత్వం సమ్మర్‌క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 25 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ నెల 11 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు శారీరక దృఢత్వం పెంచేందుకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున రూ.12.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. సమ్మర్ క్యాంపుల్లో 1500 పైగా విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఏఐతో పాటు పలు అంశాల్లో శిక్షణ
వేసవి శిక్షణ శిబిరాల్లో ఏఐపై అవగాహన కల్పించడంతో పాటు కంప్యూటర్, రోబోటిక్స్, సైన్స్ ప్రయోగాలు, చిత్ర లేఖనం, గణితం సులభంగా ఎలా చేయడంపై ప్రత్యేకంగా నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా చెస్, క్యారమ్ వంటి ఇండోర్ గేమ్స్‌తో పాటు, జానపద, శాసీ్త్రయ నృత్యం, పాటలు, సంగీతం, వాయిద్యాలతో పాటు బాల్ బ్యాడ్మింటన్‌తో పాటు పలు ఆటలపై విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాగా దుబ్బాక పట్టణంలోని పీఎంశ్రీ జడ్పీజీహెచ్‌ఎస్ పాఠశాలలో 70 మందికి పైగా విద్యార్థులు రోబోటిక్స్, డ్రాయింగ్, కంప్యూటర్‌తో పాటు పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.
సులభంగా గణితం..
సులభంగా గణితం ఎలా చేయాలో, క్లిష్టమైన వాటిని ఎలా ఛేదించడం వంటి అంశాలను నేర్చుకున్నాం. ఈ సమ్మర్ క్యాంపుతో మానసికంగా ,శారీరకంగా చాలా ఉపయోగంగా ఉంది. ఉపాధ్యాయులు పలు అంశాల్లో శిక్షణ ఇస్తుండ్రు. ఈ క్యాంపులో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
– విద్య, పదోతరగతి
ఏఐపై అవగాహన
సమ్మర్ క్యాంపులో ఏఐపై అవగాహన కల్పించారు. ఇప్పుడు ఏఐ ఉపయోగాలు తదితర అంశాలపై అవగాహన వచ్చింది. ఉపాధ్యాయులు చాలా చక్కగా శిక్షణ ఇస్తుండ్రు.
–అఖిల, 9వ తరగతి
భవిష్యత్తుకు పునాది
భవిష్యత్తుకు సంబంధించి చాలా చక్కటి మార్గం ఏర్పడింది. ఫ్యూచర్‌లో ఎలా ముందుకు పోవాలనే దానిపై తెలుసుకున్నాం. నైపుణ్యం ఉన్న ఆటలతో పాటు పలు అంశాలపై మంచిగా శిక్షణనిస్తున్నారు.
–రేణుశ్రీ, పదోతరగతి
అభిరుచి ఉన్న అంశాల్లో..
వేసవి శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దుబ్బాకలో తమ పాఠశాలతో పాటు చుట్టు ప్రక్కల పాఠశాలకు చెందిన 70 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి ఇలాంటి క్యాంపులతో వెలికితీయవచ్చు. వారికి అభిరుచి ఉన్న అంశాల్లో రాటుదేలుతున్నారు. –పట్నం భూపాల్, హెచ్‌ఎం, పీఎంశ్రీ జెడ్పీజీహెచ్‌ఎస్, దుబ్బాక


