రోళ్లు పగుల్తున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

రోళ్లు పగుల్తున్నాయ్‌!

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

మండుతున్న ఎండలు

రోడ్లన్నీ నిర్మానుష్యం..

నారాయణఖేడ్‌: రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని నానుడి. ఈ కార్తె ప్రవేశించగానే విపరీతమైన ఎండలు ప్రారంభమవుతాయి. అయితే అందుకు భిన్నంగా భరణి కార్తె నుంచే ఎండలు ముదిరిపోయాయి. ఇక కృత్తిక కార్తె వచ్చేనాటికి ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు జనాలు తల్లడిల్లుతున్నారు. ఈనెల 11 నుంచి కృత్తిక కార్తె ప్రారంభమై ఈనెల 24వరకు కొనసాగనుంది. 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమై జూన్‌ 7వ తేదీవరకు ఉంటుంది. వేసవి కాలం మొత్తంలో అత్యధికంగా రోహిణి కార్తెలోనే ఎండలు మండిపోతాయి. కానీ, ఈ ఏడాది మాత్రం భరణి కార్తె చివరి నుంచే ఎండల ఉధృతి పెరిగి కృత్తిక కార్తెలోనే రోహిణి నాటి ఎండల తీవ్రత చూపించింది. మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కాగా ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ముందస్తు హెచ్చరికలు

ఎండల తీవ్రతపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోనూ ఎండల తీవ్ర అధికంగా ఉందంటూ జనాల మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశాన్ని చేరవేసింది. జిల్లాలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. వేసవిలో వడగాడ్పులు కూడా వీస్తాయని హెచ్చరించింది. మండే ఎండలతో ప్రాణాంతక వడదెబ్బ సోకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై తీవ్ర ప్రభావం చూపనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అనారోగ్యం పాలే...

ఎండ ధాటికి వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతుంది. జ్వరం, వాంతులు, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, సొమ్మసిల్లి పడిపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే వడదెబ్బకు గురైనట్లు గుర్తించి తక్షణ వైద్యం అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు నీడపట్టున ఉండాలని, ప్రతీ రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు నీటిని సేవించాలని సూచిస్తున్నారు. పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి బొండాలు, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.

రోహిణికి ముందే పెరిగిన ఉష్ణోగ్రతలు

కృత్తిక కార్తెలోనే రోహిణి వేడి

మున్ముందు మరింత ఆందోళనే

ఎన్‌డీఎంఏ హెచ్చరికలు

ఎండల తీవ్రత ఉదయం 10గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4గంటలవరకు కొనసాగుతోంది. ఈ సమయంలో జిల్లాలో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జన సంచారం కన్పించడంలేదు. అత్యవసరమైతే తప్ప మిగతావారు బయటకి రావడానికి జంకుతున్నారు. ఈ ఏడాది ముందస్తుగానే వస్తాయని భావించిన నైరుతి రుతుపవనాలు ఆగమనం ఆలస్యం అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఎండలు మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement