సెలవులు వాడుకుందాం..
● డ్రాయింగ్, పేయింటింగ్ తదితర వాటిని నేర్చుకోవడం ● కుటుంబ సభ్యులతో కలిసి ఆటలాడటం, కథలు చెప్పడం
నారాయణఖేడ్: వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఆటవిడుపుగా మారుతుంది. ఇన్నాళ్లూ కేవలం పాఠ్యాంశాలతోనే కుస్తీ పట్టిన చిన్నారులు పలు అంశాలను నేర్చుకోవడం, ఇంటి సభ్యులకు సహకరించడం లాంటివి చేయొచ్చు. విజ్ఞానం, ఆరోగ్యం, జీవన నైపుణ్యం, సామాజిక, వ్యక్తిత్వాభివృద్ధి, ఆటలు తదితర అంశాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వేసవి సెలవుల్లో చిన్నారులు చేయాల్సిన కొన్ని పనులు...
సృజనాత్మక కార్యక్రమాలు
డ్రాయింగ్, పేయింటింగ్, కథలు రాయడం లేదా, కామిక్ తయారు చేయడం, ఫొటోగ్రఫీ నేర్పించడం, బేసిక్ కంప్యూటర్ లేదా కోడింగ్ లాంటివి నేర్చుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లిష్, అబాకస్ లేదా మ్యాథ్స్ గేమ్స్, సైన్స్‌లో ఎక్స్‌పరిమెంట్స్, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చు. క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లేదా స్కేటింగ్, కుటుంబ సభ్యులతో కలిసి క్విజ్ పోటీలు, క్యాంప్‌ఫైర్ కథలు, కుకింగ్‌లో చిన్న సహాయం చేయడం.
ప్రకృతి బాధ్యత..
మొక్కలు నాటడం, తోటపని, పక్షుల గూర్చి వివరించడం, పెంపుడు జంతువుల సంరక్షణ, నీటి సంరక్షణ గూర్చి అవగాహన, ఉదయం ఆటలు మధ్యాహ్నం క్రాఫ్ట్, సాయంత్రం బయటి ఆటలు, రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి గేమ్స్ లేదా కథలు చెప్పడం.
సామాజిక, వ్యక్తిత్వాభివృద్ధి..
పెద్దలకు సహాయం చేయడం, కొత్త స్నేహితులను చేసుకోవడం, పబ్లిక్ స్పీకింగ్ లేదా స్టేజ్ ఫియర్ తగ్గించే కార్యకలాపాలు, ప్రతీ రోజు ఒక మంచి అలవాటు. అభ్యాసం, కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇళ్లకు వెళ్లడం, పర్యటనలు లేదా దగ్గర్లోని ద్రేశాలు చూడటం చేయాలి. వంటలు నేర్చుకోవడం, గది సర్దుకోవడం, వస్తువులు సక్రమంగా పెట్టడం, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, డబ్బు సేవింగ్ అలవాటు నేర్చుకోవడం తదితర కార్యక్రమాలు చేసుకోవచ్చు.
సాధన చేసి..
సత్తా చాటుతాం
హుస్నాబాద్: వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఆసక్తి ఉన్న క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు చిన్నారులు. హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో చిన్నారుల సందడి నెలకొంది. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీనియర్ క్రీడాకారుడు, కోచ్ టాగూర్ దిలీప్ సింగ్ చిన్నారులకు షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు 25 మంది పిల్లలకు షటిల్ బ్యాడ్మింటన్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. వామప్, ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తున్నారు. మినీ స్టేడియంలో యువతీయువకులు వాలీబాల్ ప్రాక్టిస్ చేస్తూ క్రీడలపై ఆసక్తి చూపుతున్నారు. చిన్నతనం నుంచే ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే శారీరకంగా, మానసికంగా దోహదపడుతుంది. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదో ఒక క్రీడలో తమ పిల్లలు నైపుణ్యం సాధించేలా ప్రోత్సహిస్తూ శిక్షణ శిబిరానికి పంపిస్తున్నారు. వేసవిలో నిర్వహించే సమ్మర్ క్యాంపులో చేరి క్రీడల్లో రాణించాలని చిన్నారులు ఆసక్తి కనబరుస్తున్నారు.


