● రైతులను పట్టించుకోవడం లేదు ● ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్‌రావు ఫైర్
చేగుంట(తూప్రాన్): రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం మండలంలోని కర్నాల్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించలేదన్నారు. మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేటతో పాటు మరికొన్ని జిల్లాల్లో మక్క లు, శనిగలు, సన్‌ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. సీఎం నిత్యం ఢిల్లీకి వెళ్లి అధిష్టానికి కప్పం కట్టి రావడం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాలో ఒక్క మంత్రి అయినా కొనుగోలు కేంద్రాలను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష జరిపారా..? అని ప్రశ్నించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, నాయకులు ఉన్నారు.


