రెండు బైకులు, ఆటో ఢీ.. | - | Sakshi
Sakshi News home page

రెండు బైకులు, ఆటో ఢీ..

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

నర్సాపూర్‌ రూరల్‌: రెండు బైకులు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నర్సాపూర్‌ – సంగారెడ్డి రహదారిలోని ఆనంద్‌ గార్డెన్‌ సమీపంలో చోటు చేసుకుంది. నర్సాపూర్‌ ఎస్సై రంజిత్‌ రెడ్డి వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం చిన్న కంజర్ల గ్రామానికి చెందిన యటకాని నర్సింగరావు (29) ఇటీవల తనకు కూతురు పుట్టడంతో అత్తగారి గ్రామమైన నర్సాపూర్‌ మండలం లింగాపూర్‌కు బైక్‌పై నర్సాపూర్‌ వైపు వస్తున్నాడు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన కోడిగుడ్ల దిలీప్‌(18) అతని స్నేహితుడు మనోహర్‌తో కలిసి బైక్‌పై సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లోని బంధువుల పెళ్లికి సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అలాగే నర్సాపూర్‌ వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్‌ ఆటోను సైతం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యటకాని నర్సింగరావు, కోడిగుడ్ల దిలీప్‌ అక్కడికక్కడే మృతి చెందారు. దిలీప్‌ బైకుపై వెనకాల కూర్చున్న మనోహర్‌కు, ప్యాసింజర్‌ ఆటోలో ప్రయాణిస్తున్న అశోక్‌, కవిత, రమేశ్‌, ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వీరిని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దిలీప్‌ అతివేగంగా, అజాగ్రత్తగా బైక్‌ నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

బైకును లారీ ఢీకొట్టడంతో ఒకరు..

మిరుదొడ్డి(దుబ్బాక): బైకును లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారి 765డీజీ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా... దుబ్బాక మండలం నర్లెంగి గడ్డకు చెందిన యమ్మ పోచయ్య (70), తన మనవడు మనోజ్‌తో కలిసి దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో జరిగిన శుభకార్యానికి బైకుపై వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ధర్మారం జాతీయ రహదారి వద్ద సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న లారీ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మనోజ్‌ను అంబులెన్స్‌లో పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

మెదక్‌ జిల్లాలో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement