సిద్దిపేటజోన్: అమ్మ అనే పదం కమ్మనైనది.. అమ్మ ప్రేమ జీవితాంతం తోడు ఉంటుంది. వివిధ కారణాలతో అమ్మ ప్రేమ దూరమైనా అభాగ్యుల పాలిట కోవెల లాంటిది బాలసదనం. జిల్లా కేంద్రంలో 41 సంవత్సరాలుగా తల్లి ప్రేమ కోల్పోయిన వారందరికీ వసతి ఇస్తుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉన్న వారందరికీ బాలసదనం సిబ్బంది అమ్మ లాగా ప్రేమ, ఆప్యాయతలు పంచుతోంది. ప్రస్తుతం 40మంది అమ్మాయిలు బాలసదనంలో ఉన్నారు. వారి బాగోగులు చూసేందుకు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. బాలసదనంలో ఉండే వారికి వసతి, విద్య, భోజనం ఏర్పాట్లు, అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఇక్కడ పనిచేసున్న సిబ్బంది ఎలాంటి లాభపేక్ష లేకుండా అభాగ్యులను తమ సొంత బిడ్డల లాగా చూసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే ప్రతి మహిళ బాలసదనం పిల్లలకు ఒక తల్లి లాంటిదే.


