కొనుగోళ్లు వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగిరం చేయాలి

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

సంగారెడ్డి /సంగారెడ్డి జోన్‌: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. జోగిపేట మార్కెట్‌ యార్డుతోపాటు చౌటకూరు మండలం కొర్పోల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హమాలీలు, లారీలు, టార్పాలిన్‌ కవర్లు, గోనె సంచుల లభ్యత, ట్యాబ్‌ ఎంట్రీలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, రైతుల ఖాతాల్లో జమ చేసిన చెల్లింపుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో అధికారులు, రైస్‌ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రా ల్లో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అకాల వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 233 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మ్యాపింగ్‌ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) 2026 కార్యక్రమంలో భాగంగా భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో 2002 ఓటరు జాబితాలో నమోదైన ప్రతీ అర్హులైన ఓటరు తమ వివరాలను 2025 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ చేయించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లై డీఎం అంబదాస్‌, డీఆర్‌డీవో పీడీ జ్యోతి, డీసీఓ కిరణ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ ఏడీ ప్రసాద్‌, తహసీల్దారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు

జోగిపేట(అందోల్‌): ఎలుకలు కొట్టిన టార్పాలిన్లు పంపిణీ చేస్తున్నారని, వర్షం వస్తే ధాన్యమంతా తడిసిపోయే ప్రమాదముందని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ వద్ద రైతులు వాపోయారు. కేంద్రం వద్ద రైతులకు సమస్యలున్నాయా? అని అడగ్గా కొంతమంది రైతులు టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల గూర్చి ఫిర్యాదులు చేశారు. ఈ కేంద్రానికి ఎన్ని గన్నీ బ్యాగులు అవసరమో ఇండెక్స్‌ పెడితే ఏర్పాటు చేస్తామన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement
 
Advertisement
Advertisement