సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిజాంకాలం నాటి సాగునీటి కాలువ గంగకత్వ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువ మరమ్మతులకు రూ.42 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కాలువ ఆధునీకరణ చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి గతంలో తీసుకెళ్లడంతో ఈ పనులకు మోక్షం లభించింది. నీటి పారుదలశాఖ ఈ కాలువ ఆధునీకరణ పనుల కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన నీటి పారుదలశాఖ ఈ నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌తో కలిసి జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. సదాశివపేట మండలం సూరారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ గంగకత్వ కాలువ 11 గ్రామాల శివారుల మీదుగా మాచిరెడ్డిపల్లి వరకు పారుతుంది. దీనికి 33 ఫీడర్ చానల్‌లు ఉన్నాయి. ఈ కాలువను ఆధునీకరిస్తే అదనంగా మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువపై అవసరం ఉన్న చోట్ల కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలకు, తూములను మరమ్మతులు చేస్తారు. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు.
నిజాంకాలం నాటి కాలువఆధునీకరణకు రూ.42 కోట్లు
మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఇరిగేషన్
అధికారులతో జగ్గారెడ్డి సమావేశం


