సిద్దిపేటకమాన్: ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న తల్లీ, ఇద్దరు కూతుళ్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కమిషనర్ పెరుమాళ్ రష్మీ అదనపు డీసీపీ కుశాల్కర్‌తో కలిసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఆవుల నాగమణి, ఆవుల లక్ష్మి, కంకణాల మరియమ్మ, వారి సమీప బంధువులైన యాతం కోటేశ్వరరావు, గంజనబోయిన దినేశ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ప్రయాణికులన ఏమార్చి బంగారు నగలు తస్కరించేవారు. పది రోజుల క్రితం గుంటూరులో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి రెండు తులాల బంగారు గొలుసును దొంగిలించారు. గత నెల 30న యాదగిరిగుట్టలో బస్సెక్కిన ఒక మహిళ బ్యాగులో నుంచి నాగమణి, లక్ష్మి ఏడున్నర తులాల బంగారు నగలను తస్కరించారు. చేర్యాలలో దిగి ఇతర ముఠా సభ్యుల సహకారంతో అద్దె ఇన్నోవా కారులో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చుంచనకోట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక వాహనాన్ని, రూ.15 లక్షల విలువైన తొమ్మిదన్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన చేర్యాల సీఐ రమేశ్, ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి, సిబ్బందిని సీపీ అభినందించారు. సమావేశంలో సీఐ కిరణ్, ఆర్‌ఎస్‌ఐ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
తల్లీ ఇద్దరు కూతుళ్లు సహా
ఐదుగురు అరెస్టు
రూ.15 లక్షల
విలువైన బంగారం స్వాధీనం
వివరాలు వెల్లడించిన
సీపీ రష్మీ పెరుమాళ్


