● గతేడాది కంటే పది లక్షల మొక్కలు కుదింపు ● నాటడానికి ఆసక్తి చూపని ప్రభుత్వ శాఖలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పచ్చదనాన్ని పెంచి..పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వనమహోత్సవం లక్ష్యాల్లో కోతలు పడుతున్నాయి. నాటే మొక్కల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. గతేడాది వనమహోత్సవంలో 36.04 లక్షల మొక్కలు నాటగా, ఈ ఏడాది ఈ లక్ష్యాన్ని 26.98 లక్షలకు తగ్గించారు. ఆయా ప్రభుత్వ శాఖలు నాటే మొక్కల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం ప్రకృతి ప్రేమికులను ఒకింత నిరాశకు గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భారీ సంఖ్యలో మొక్కలు నాటేవారు. కేవలం నాటుడుకే పరిమితం కావడం, వాటి సంరక్షణను గాలికి వదిలేయడంతో ఆ మొక్కలు ఎండిపోయి, పశువులకు మేతగా మారేవి. దీంతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నప్పటికీ హరితహారం లక్ష్యం నెరవేరేది కాదు. ఇప్పుడు మొక్కలు నాటే లక్ష్యాన్నే ఏటా కుదిస్తుండటం గమనార్హం.
గతేడాది మిగిలిన మొక్కలే 18 లక్షలు
వర్షాలు కురిసిన తర్వాత వనమహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం 613 నర్సరీలున్నాయి. వీటిలో గతేడాది నాటకుండా వదిలేసిన మొక్కలే సుమారు 18 లక్షల వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మొక్కలు చాలావరకు పెరిగి పెద్దయ్యాయి. దీంతో చిన్న కవర్ల నుంచి వీటిని పెద్ద కవర్లలోకి మార్చారు. వర్షాలు పడిన వెంటనే ముందుగా గతేడాది మిగిలిపోయిన ఈ 18 లక్షల పెద్ద మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈ మొక్కలు పూర్తయ్యాక, ఈ ఏడాది పెంచుతున్న మొక్కలను నాటేలా ప్రణాళిక రూపొందించారు.
వనమహోత్సవంలో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు ఏటా ఎన్ని మొక్కలు నాటాలనేది లక్ష్యంగా పెట్టుకుంటాయి. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నాటే మొక్కల లక్ష్యం ఏకంగా ఆరున్నర లక్షలకు తగ్గింది. ఈ శాఖ ద్వారా 2025లో మొత్తం 27 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈసారి ఈ లక్ష్యాన్ని 20.50 లక్షలకు కుదించారు. అటవీశాఖ మొక్కలు నాటే లక్ష్యాన్ని 1.20 లక్షల నుంచి లక్షకు తగ్గింది. ఎకై ్సజ్ శాఖ మొక్కల నాటే లక్ష్యం కూడా దాదాపు 50% తగ్గింది. ఇలా మొత్తం 14 శాఖలకు నిర్దేశిత లక్ష్యాలు తగ్గించారు. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కలిపి నాటే మొక్కల సంఖ్య కూడా దాదాపు 1.35 లక్షలకు కుదించారు. ఇలా మొత్తంగా గతేడాది కంటే ఈసారి మొక్కలు నాటే లక్ష్యం దాదాపు పది లక్షలు కుదించడం గమనార్హం.
గత మూడేళ్ల లక్ష్యాలు ఇలా..
సంవత్సరం మొక్కలు నాటే లక్ష్యం
2024 32.86 లక్షలు
2025 36.04 లక్షలు
2026 (ఈసారి) 26.98 లక్షలు
ఆరున్నర లక్షలు తగ్గిన డీఆర్‌డీఏ మొక్కల లక్ష్యం


