పడిపోతున్న హాజరు
ఉపాధి పనుల్లో ఎన్‌ఎంఎంఎస్ విధానం ఉదయం మొదటి ఫొటో, నాలుగు గంటల తర్వాత రెండోది పనిప్రదేశం వద్ద ఇంతసేపు ఉండేందుకు అయిష్టత క్రమంగా పడిపోయిన ఉపాధి కూలీల హాజరు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు వ్యవసాయ కూలీలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఈ విధానంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు నిరాసక్తత చూపుతున్నారు.దీంతో కొన్ని ప్రాంతాల్లో అసలుకే వెళ్లకపోగా, మరికొన్ని గ్రామాల్లో కూలీల హాజరు శాతం సగానికి సగం పడిపోతోంది. పనిచేసే ప్రదేశంలో ఏకంగా4 గంటల పాటు గడపాల్సి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
జహీరాబాద్: పనుల్లో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎంఎంఎస్) విధానాన్ని ప్రభుత్వం ఈనెల నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేసింది. రోజుకు రెండుసార్లు కూలీల ఫొటోలను జియో–ట్యాగ్డ్, టైమ్–స్టాంప్ ఫొటోలను వర్క్‌సైట్ సూపర్‌వైజర్ అప్‌లోడ్ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడికి ఈకేవైసీ చేస్తారు. దీన్ని ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. కూలీలు ఉదయం పని ప్రదేశం వద్దకు రాగానే ఫొటోను తీసుకోవాలి. ఉపాధి పనులు పూర్తి చేసుకున్నాక వచ్చిన సమయం నుంచి నాలుగు గంటలు లెక్క కట్టి రెండో ఫొటోను తీయాల్సి ఉంటుంది. నాలుగు గంటలకు ఒక నిమిషం తక్కువ ఉన్నా ఫొటోను యాప్ అనుమతించదు. వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు కాకుండా మిగిలిన అన్ని పనులకు దీన్ని వర్తింపజేశారు. కూలీల పర్యవేక్షణ, వేగవంతమైన చెల్లింపులు, పథకంలో అవినీతిని తగ్గించేందుకుగాను ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. తెలుగుతో సహా ఇతర అన్ని భాషల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. నెట్‌వర్క్‌లేని చోట ఆఫ్‌లైన్‌లో హాజరు నమోదు చేసి, నెట్‌వర్క్‌రాగానే అప్‌లోడ్ చేయవచ్చు. నెట్‌వర్క్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురైతే జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్(డీపీసీ) మాన్యువల్ హాజరును ఆమోదించే అవకాశం కూడా ఉంది.
ఇలా వచ్చి అలా వెళ్లడం కుదరదు
గతంలో కూలీలు ఇలా వచ్చి గంటసేపు పనులు చేసుకుని తిరిగి వెళ్లిపోయేవారు. కొద్దిసేపు ఉపాధి పనులు చేసుకుని వెళ్లాక, ఉదయం 11 నుంచి 12 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్లేవారు. ఎన్‌ఎంఎంఎస్ విధానంతో కూలీ పనులకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఉపాధికూలీల హాజరు శాతం 30% వరకు మాత్రమే ఉంటోంది.
పనులు చేశాక గ్రూప్‌ఫొటో
ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు ఉదయం పూట వ్యక్తిగత ఫొటో తీస్తారు. నాలుగు గంటలు గడిచాక కూలీలందరినీ కలిపి గ్రూప్‌ఫొటో తీస్తారు. ఒక బృందంలో పదిమంది వరకు కూలీలు ఉంటారు. ఉదయం 8 గంటలకు పనులకు వెళ్లేవారు మధ్యాహ్నం 12 గంటల వరకు పని ప్రదేశంలోనే ఉండాలి. అనంతరం గ్రూప్‌ఫొటో దిగి వెళ్లాలి.
ఒకరి స్థానంలో బదులు ఉండదు
ఈ విధానంలో ఒకరికి బదులు మరొకరు పనిచేసే అవకాశం ఉండదు. ఇంతకుముందు జాబ్‌కార్డు కలిగి ఉన్న వారిలో ఒకరికి బదులు మరొకరు వచ్చినా హాజరు పడేది. భార్య బదులు భర్త, భర్త బదులు భార్య లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చినా హాజరు వేసేవారు. ఎన్‌ఎంఎంఎస్ విధానంలో ఇది అసలే కుదరదు. ఐరిస్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో నమోదవుతుంది.
జహీరాబాద్ మండలంలో గతేడాది ఏప్రిల్‌లో ఉపాధి కూలీల హాజరు రోజుకు 2,200 వరకు ఉండేది. ప్రస్తుతం ఇది 900 మందికి పడిపోయింది. మండలంలోని అర్జున్‌నాయక్ తండా, హుగ్గెల్లి తండాల్లో కూలీలు ఉపాధి పనులకు అసలుకే వెళ్లడం లేదు. ఆనెగుంట గ్రామంలో ఈ విధానం రాక ముందు ప్రతీనిత్యం 300 మందికి పైగా పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం 89 మంది వరకు మాత్రమే వెళుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
ఉపాధి కూలీలకు ఈ విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. గతంలో మాదిరిగానే పనులకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. పని ప్రదేశంలో నిబంధనల మేరకు నాలుగు గంటల పాటు ఉండాల్సిందే. తమ సిబ్బందితో గ్రామాల్లో కూలీలకు అవగాహన కల్పించి పనులకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నాం. క్రమంగా వారు ఈ విధానానికి అలవాటు పడతారు.
–అశోక్‌కుమార్, ఏపీఓ, జహీరాబాద్


