దుబ్బాకటౌన్: మద్యం మత్తులో బావిలో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై కీర్తిరాజు వివరాల ప్రకారం... దుబ్బాక మున్సిపల్ మల్లయ్యపల్లి వార్డుకు చెందిన కోతుల స్వామి (36) కూలి పని చేస్తూ, సోదరుని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. స్వామి ప్రతిరోజు కూలి పని చేస్తూ, వచ్చిన డబ్బులతో విపరీతంగా మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. మద్యం మత్తులో పట్టణ శివారులోని పాతూరి రాంరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. శనివారం ఉదయం మృతదేహం, చెప్పులు, బట్టలు గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి, శవ పరీక్ష కోసం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


