ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు
బీఆర్‌ఎస్ నాయకులు
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు పలికారు. గజ్వేల్ మండలం కోమటిబండకు చెందిన షేక్ భాస్కర్ అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చురుకై న కార్యకర్తగా ఉంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనదైన ముద్ర వేశాడు. రోడ్డు ప్రమాదంలో భాస్కర్ మృతి చెందాడనే విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ నాయకులు భారీ సంఖ్యలో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. సోమవారం భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మధులతో పాటు తాజా మాజీ ప్రజాప్రతినిధులు భాస్కర్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కాగా భాస్కర్ మృతితో కోమటిబండలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతిమయాత్రలో వందలాది సంఖ్యలో ఉద్యమకారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే భాస్కర్ భౌతికంగా లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.


