వారెవ్వా..!
భార్య సర్పంచ్.. భర్త వార్డు మెంబర్
ఉద్యమకారుడికి పట్టం
వట్‌పల్లి(అందోల్): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లిలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుదారుడైన టి. సునీతా 70 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. 3వ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన ఆమె భర్త మహిపాల్ 52 ఓట్లతో విజయం సాధించారు. ఒకే పంచాయతీ కార్యవర్గంలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా ఉండడంతో సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు గెలుపొందడం పట్ల కుటుంబ సభ్యులు, మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.
ఐదోసారికి ‘స్వప్న’ం సాకారం
పుల్‌కల్(అందోల్): పంచాయతీ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలైనా ఆ దంపతులు నిరాశ చెందలేదు. పుల్‌కల్ మండల పరిధిలోని సూరెడ్డి ఇటిక్యాల గ్రామానికి చెందిన కలాలి స్వప్న కుటుంబం సర్పంచ్ బరిలో నిలబడేవారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పోటీలో ఉండేవారు. నాలుగు సార్లు స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. అయినా ఏ నాడూ వారు నిరుత్సాహ పడలేదు. ఓటమి కుంగదీసినా వెనుకడుగు వేయలేదు. ఐదోసారి బరిలోకి దిగారు. స్వప్న 575 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన చిరకాల ‘స్వప్నం’ను సాకారం చేసుకున్నారు.
ఎంపీటీసీ పాయే... సర్పంచ్ వచ్చే..
మునిపల్లి(అందోల్): పెద్దచల్మెడ ఎంపీటీసీ రాధాబాయి జోషి పదవీ కాలం పూర్తయి రెండేళ్లు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇంతలోనే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ బరిలోకి దిగారు. పెద్దచల్మెడ సర్పంచ్‌గా రాధాబాయి గెలుపొందారు. సోమవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆమెను అభినందించారు.
రాయికోడ్(అందోల్): పంచాయతీ ఎన్నికల్లో రాయిపల్లి గ్రామ ఉద్యమకారుడికి పట్టంకట్టారు. గ్రామానికి చెందిన కాశి బస్వరాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సర్పంచ్ బరిలో నిలిచిన ఆయన.. సమీప ప్రత్యర్థి శ్రీశైలంపై 301 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. ఉద్యమకారుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికవడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
విజేతలతో సందడి
● క్యాంపు కార్యాలయాలు కిటకిట
● శుభాకాంక్షల వెల్లువ
జహీరాబాద్: సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు తమ తమ పార్టీ నేతలతో కలిసేందుకు వస్తుండడంతో ఆయా పార్టీల కార్యాలయాలు సందడిగా మారాయి. న్యాల్‌కల్ మండలంలో ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో సోమవారం సాయంత్రం జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌లు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు ఆయా మండలాలకు చెందిన విజేతలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన వారికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డిలు పార్టీ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన విజేతలకు, పార్టీ శ్రేణులకు స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం అందించినందుకు గాను పార్టీ శ్రేణులను అభినందించారు. ఈ సందర్భంగా విజేతలకు మిఠాయిలు తినిపించి, శాలువాలతో సత్కరించారు.
వారెవ్వా..!
వారెవ్వా..!
వారెవ్వా..!
వారెవ్వా..!
వారెవ్వా..!


