వలస ఓటరే కీలకం
కలిసొచ్చిన అభ్యర్థులు
వలస ఓటర్లకు పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల గ్రామ స్థాయి నాయకులు నామినేషన్ల విత్‌డ్రాల అనంతరం గుర్తుల కేటాయింపు జరగగానే వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. రెండు, మూడు రోజులు వలస ప్రాంత ఓటర్లకు కలిసి మద్దతు కూడగట్టారు. తమకు ఓటేసి గెలిపించాలని, ఓటేసేందుకు గ్రామాలకు రావాలని వేడుకున్నారు. కొందరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండటంతో వారి వద్దకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకొని వెళ్లి వచ్చేందుకే రెండు రోజులు పట్టింది.
నారాయణఖేడ్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తమ చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వలస ఓటర్ల ప్రభావం బాగా చూపనుంది. జిల్లాలో అత్యధికంగా వలసలకు పెట్టింది పేరుగా నారాయణఖేడ్ నియోజకవర్గం నిలిచింది. ఈ ప్రాంతం నుంచి మెజార్టీ జనాలు వలస జీవనం సాగిస్తుంటారు. దాదాపు ప్రతీ గ్రామం నుంచి వలస వెళ్లిన జనాల సంఖ్య వందల్లో ఉంటుంది. చిన్న గ్రామంలో 500 ఓటర్లు ఉంటే అందులో 100 నుంచి ఆపైగా.. పెద్ద పంచాయతీల్లో 250 నుంచి 400మంది వరకు వలస వెళ్లిన వారు ఉంటారు. 230 గ్రామాలు, మరో 220 వరకు గిరిజన తండాలు నియోజకవర్గంలో ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతంలోని ఫ్యాక్టరీ, భవన నిర్మాణ రంగారాల్లో అత్యధిక స్థాయిలో గ్రామాల జనాలు ఉండగా.. జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోని చెరకు కర్మాగారాలకు గిరిజనులు వలస వెళ్తారు. సిరిసిల్లతోపాటు ఇతర ప్రాంతాలకు నేత కార్మికులు వలస వెళ్తారు. దీంతో ప్రతీ గ్రామంలో వలస వెళ్లిన ఓటర్లను ఓటు వేయించేందుకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు పూర్తి చేశారు.
ఓటర్లకు వాహనాలు
ఇప్పటికే వలస ఓటర్లను కలిసిన అభ్యర్థులు, నాయకులు వారు గ్రామాలకు వచ్చేందుకు కార్లు, ట్రావెల్స్, ఇతర వాహనాలను ఏర్పాటు చేయించారు. పోలింగ్ నాడు వారు గ్రామాలకు వాహనాల్లో రానున్నారు. కొందరు బస్సుల్లో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వారు వచ్చి వెళ్లే వరకు అన్ని ఏర్పాట్లు చేయించారు. వలస ఓటర్లు చాలామంది కూడా పోటీలో ఉన్న అభ్యర్థులు అందరికీ ఫోన్లు చేసి తాము గ్రామానికి వస్తామని సమాచారం ఇస్తూ ‘మద్దతు’ కోరారు. ఒక్కరికి ఇంత చొప్పున అని లెక్క కట్టి ముట్టచెప్పారు. రూ.వేయి నుంచి రూ.2వేల వరకు అందజేశారు. వలస ఓటర్లకే ఇన్నేసి లక్షలు అయ్యాయంటూ కొందరు నాయకులు, అభ్యర్థులు ప్రైవేట్ సంభాషణల్లో వాపోతున్నారు. జీవనోపాధికోసం గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఓటేసేందుకు గ్రామానికి వచ్చి వెళ్లేందుకు రెండో రోజులు అవ్వడంతో ఆ సమయంలో కూలీ పనులు పోగొట్టుకుంటున్నందున అందుకు తగ్గట్లుగా అభ్యర్థులు, నాయకులు చెల్లింపులు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కావడంతో వలస ఓట్లను కోల్పోకుండా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు వాట్సప్ ద్వారా సందేశాలు పంపిస్తూ టచ్‌లో ఉంటున్నారు. గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లిన వారికి ఓటేసేందుకు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు.
వారిపై ప్రత్యేక దృష్టి సారించిన
అభ్యర్థులు
ప్రత్యేక వాహనాలూ ఏర్పాటు
పోలింగ్ నాడు ఉదయం గ్రామానికి
చేరుకోనున్న ఓటర్లు
ప్రతీ ఓటు కీలకం కావడంతో
విశ్వ ప్రయత్నాలు
ఖేడ్‌లో మెజార్టీ జనాల వలస జీవనం


