బీఆర్‌ఎస్ మద్దతు దారులను గెలిపించండి
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్: అధికరాంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ మండలం సంజీవన్‌రావుపేటతోపాటు పలుగ్రామాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు కనువిప్పు కలిగించాలన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఆయాపంచాయతీల అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు.
18న ఉచిత
కంటివైద్య శిబిరం
నారాయణఖేడ్: శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నానక్‌రాం గూడలోని శంకర ఆస్పత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో నారాయణఖేడ్‌లోని శ్రీసత్యసాయి మందిరంలో ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవాసమితుల జిల్లా కనీనర్ శంకరప్ప తెలిపారు. కంటిపొరలు వచ్చినవారికి శంకర ఆస్పత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు. కంట్లో పొరలు వచ్చినవారు ఆధారు కార్డు జిరాక్స్, ఫోన్ నంబరు, ఏవైనా మందులు వాడుతుంటే వాటిని తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విధుల కేటాయింపు ఇలా..
సంగారెడ్డి జోన్: మూడో విడత పంచాయతీ ఎన్నికలలో ర్యాండమైజేషన్ ద్వారా అధికారుల కేటాయింపు పూర్తయిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో చివరి విడతలో పోలింగ్ జరిగే మండలాల తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మ్యాన్ పవర్ మోడల్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మల్లన్నకు లక్ష బిల్వార్చన
కొమురవెల్లి(సిద్దిపేట): మేడలాంబ, కేతమ్మ సమేత కొమురవెల్లి మల్లికార్జున స్వామికి సోమవారం వైభవంగా లక్షబిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు రుద్రనామస్మరణతో మారుమోగాయి, ఈ సందర్భంగా వీరశైవ రుత్వికులు స్వామివారికి శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన జరిపారు. ఆదివారం స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మల్లన్నకు సుప్రభాతసేవ, గణపతిపూజ, గౌరి పూజ, శివపుణ్యహవాచనం, అఖండ దీపస్థాపన, పంచకలశారాధన, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశరుద్ర, లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. వీరశైవ వేదపాఠశాల విద్యార్థులు మల్లన్నను స్తుతిస్తూ చేసిన మంత్రోశ్చరణలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పూజారులు పాల్గొన్నారు.
నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త, ఈఓ విజయరామారావు తెలిపారు. లక్ష్మీనృసింహుని జన్మ నక్షత్ర వేళ ఉదయం 7.30 గంటలకు నాచగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు.
బీఆర్‌ఎస్ మద్దతు దారులను గెలిపించండి
బీఆర్‌ఎస్ మద్దతు దారులను గెలిపించండి
బీఆర్‌ఎస్ మద్దతు దారులను గెలిపించండి


