డాక్టర్లు ఎక్కడ...?
● 20 మంది వైద్యులకు ఇద్దరే హాజరు ● కలెక్టర్ ప్రావీణ్య ఆగ్రహం ● జోగిపేట ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
జోగిపేట(అందోల్): జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజర్‌పై కలెక్టర్ ప్రావీణ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె జోగిపేట ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. 20 మంది వరకు డాక్టర్లకు గాను కేవలం ఇద్దరు మాత్రమే ఉండటాన్ని అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా వారంతా ఏమైనట్లు అని ఆర్‌ఎంఓ అశోక్‌ను ప్రశ్నించారు. ఏదో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ కూడా విధులకు రాకుంటే ఆసుపత్రి పరిస్థితి ఏమిటన్నారు. ఆర్డీఓ పాండు, ఇన్‌చార్జి తహసీల్దార్ మధుకర్‌రెడ్డి ఆమె వెంట ఉన్నారు.
ప్రతి రోజు ఇదే పరిస్థితి మేడం
అక్కడే ఉన్న రోగులు సైతం డాక్టర్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో ఒకరుంటే మరొకరు ఉండరని, ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తే డాక్టర్లు లేకపోవడంతో అందుబాటులో ఉండే వారితో చూపించుకొని వెళుతున్నామని చెప్పారు. ఆసుపత్రి పరిస్థితి ఎప్పుడు మారుతుందో అంటూ రోగులు నిట్టూర్చారు.
అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలన
ఆసుపత్రిలోని రిజిస్టర్‌లో డాక్టర్లంతా గైర్హాజరై ఉండడంతో కలెక్టర్ తన సెల్‌ఫోన్‌తో ఫొటో తీసుకున్నారు. విధులకు హాజరుకాని డాక్టర్లకు గైర్హాజరు వేశారు. వైద్య మంత్రి నియోజకవర్గంలోని ఆసుపత్రి పనితీరు ఉంటే ఎలా అని కలెక్టర్ అసంతృప్తితో వెనుదిరిగారు. ఎవరెవరు విధుల్లో ఉన్నారు? ఎవరు విధులకు గైర్హాజరయ్యారో వివరాలు తీసుకోవడం విశేషం. డాక్టర్లు మధ్యా హ్నం 12 గంటలకే వెళ్లిపోతున్నారన్న విషయా న్ని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
11 మంది వైద్యులకు షోకాజ్
● వైద్యవర్గాల్లో కలకలం
జోగిపేట, (ఆందోల్): విధులకు డుమ్మాకొట్టిన జోగిపేట ప్రభుత్వాస్పత్రి వైద్యులపై కలెక్టర్ ప్రావీణ్య కొరడా ఝళిపించారు. మంగళవారం ఆమె తనిఖీ చేసినప్పుడు 20 మంది వైద్యుల్లో కేవలం ఇద్దరు విధుల్లో ఉన్నారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ డుమ్మాకొట్టిన సూపరింటెండెంట్ సహా 11 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీసీ హెచ్‌ఎస్‌కు ఆదేశించారు. డాక్టర్ సౌజన్య, ఎం.అమ్మాజీ, తశనీమ్ మెహర్, శివశంకర్ రెడ్డి, నితిన్ కుమార్, ఎల్.బాంధావి, మేఘ, ఆర్.కిరణ్, పి.మాలతి, పి.ఆనంద్ నాయక్, పి. శ్రావణిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.


