గెలిచిన వారికే దండ!
కోవర్డులతో దడ
ప్రఽదాన అభ్యర్థులు, మద్దతు పలుకుతున్న పార్టీలకు కోవర్డుల భయం పట్టుకుంది. వారి బలంతోపాటు బలహీనతలు ప్రత్యర్థులకు చేరుతాయనే అనుమానాలతో అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గోప్యంత పాటించాల్సిన అంశాలు బయటికి పొక్కకుండా చూడటం ఎలా అనే విషయంలో వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థి నేతలను వారి వర్గంలోకి లాక్కోవడంతోపాటు వారి వర్గంలో నేతలు ప్రత్యర్థి గూటికి చేరకుండా చూసుకోవడం ఇప్పుడు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. తమ వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్న అభ్యర్థులు అవి ప్రత్యర్థి అభ్యర్థికి తెలియకుండా ఉండేందుకు ఎంతో జాగ్రత్త పడుతున్నారు. కోవర్డు సమస్యతో అభ్యర్థులు, పార్టీలకు దడ పుట్టించడంతోపాటు తలనొప్పిగా మారుతున్నారు.
రెబల్స్ బెడదకు నేతల సమాధానం
ఆ చోట్ల ప్రచారానికి దూరం
కోవర్డులతో దడ
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో రెబల్స్ బెడద తలనొప్పిగా పరిణమించింది. పార్టీల నాయకులు ఏ అభ్యర్థికి మద్దతు పలకకుండా మౌనం వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలుస్తారు. కొన్ని పంచాయతీల్లో ఒకే పార్టీ నుంచి పోటాపోటీగా నామినేషన్లు వేసి విత్‌డ్రాల బుజ్జగింపుల్లోనూ వినకుండా రంగంలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో ఈ సమస్య నెలకొంది. అధికార పార్టీలో ఈ సమస్య మరీ అధికంగా మారింది. ఒక పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున రంగంలో నిలవడంతో పార్టీల ఆధినాయకులకు ఎవరికి మద్దతు పలకాలో చెప్పలేని సందిగ్ధత నెలకొంది. దీంతో తాము ఎవరి గురించి చెప్పమని, గెలిచి వచ్చిన వారి మెడలో దండ వేస్తామని సమాధానం ఇస్తున్నారు. ఇలా రెబల్స్ బెడద ఉన్న గ్రామాలకు ప్రధాన నాయకులు ప్రచారానికి వెళ్లడం లేదు. పార్టీ మద్దతుతో ఒకరే రంగంలో ఉన్న గ్రామాల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు.
రెబల్స్ పోటీలో ఉన్న పంచాయతీల్లో గెలుపు, ఓటములపై ప్రభావం చూపనుందని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నారాయణఖేడ్ నియోజకర్గంలోని ఓ మండలంలో మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఓ పంచాయతీలో ఒకే పార్టీ నుంచి ముగ్గురు రంగంలో నిలవడంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తక్కువ ఓట్లతో గెలుపొందారు. సమీప అభ్యర్థి రాత్రికి రాత్రి భారీగా వ్యయం చేసినా ఫలితం శూన్యం అయ్యింది. ఈ పంచాయతీలో మెజార్టీ వార్డు స్థానాలు ఒక పార్టీ గెలుచుకోగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఫలితం దృష్ట్యా రెబల్స్ బరిలో ఉన్న ఇతర పంచాయతీల్లోని అభ్యర్థుల్లో గుబులు నెలకొంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, రెబల్స్ మధ్య గట్టి పోటీ ఉన్న తరుణంలో ప్రధానంగా అభ్యర్థులు గోప్యత, మద్దతు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. కొందరు నేతలు పార్టీలో ఉన్నా సైలెంట్‌గా ఉండడం కూడా ఆందోళనకు దారి తీస్తుంది. వీరి మౌనం మనకు మద్దతుగా ఉంటుందా ప్రత్యర్థికి అనుకూలంగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


