కాంగిరేసులో కిరికిరి | - | Sakshi
Sakshi News home page

కాంగిరేసులో కిరికిరి

Dec 2 2025 9:48 AM | Updated on Dec 2 2025 9:48 AM

కాంగిరేసులో కిరికిరి

కాంగిరేసులో కిరికిరి

పార్టీకి చెందిన ఒక్కరే బరిలో ఉండేలా బుజ్జగింపులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సర్పంచ్‌ పదవుల కోసం అధికార కాంగ్రెస్‌లో పోటాపోటీ నెలకొంది. ఒక్కో గ్రామంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు నాయకులు బరిలోకి దిగుతుండటం ముఖ్య నాయకులకు తలనొప్పిగా తయారైంది. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే గ్రామంలోని పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయి.. ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచే అవకాశాలుంటాయి. దీంతో ఎలాగైన తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసుకునేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీకి చెందిన ఒక్కరే నామినేషన్‌ వేసేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతలను హస్తం పార్టీ గ్రామ, మండల నాయకులు తీసుకున్నారు. గ్రామంలో కాంగ్రెస్‌ కేడర్‌ అంతా కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి సమన్వయం చేసే ప్రయత్నాలు చేస్తుండటం పలు గ్రామాల్లో పరిపాటైపోయింది. ఎవరైనా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైతే వారిని బుజ్జగిస్తున్నారు. ఈ బుజ్జగింపులకు లొంగకుండా తొలివిడత పోలింగ్‌ జరిగే గ్రామాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా సంబంధిత కుల సంఘాల పెద్దలు, సన్నిహితులతో మాట్లాడి ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైన ఎంపీటీసీ పదవులకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ వినని పక్షంలో ఉప సర్పంచ్‌ పదవి ఇస్తామని, అవసరమైతే వార్డు సభ్యునిగానైనా బరిలోకి దిగాలని సూచిస్తున్నారు.

గులాబీ ముఖ్య నేతల సమన్వయం

కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్‌ఎస్‌కు సర్పంచ్‌ల పదవులకు తిరుగుబాటు అభ్యర్థుల తలనొప్పి కాస్త తక్కువేనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. గ్రామంలో పట్టున్న వారిని, పైగా ఆర్థికంగా బలంగా ఉన్న వారిని బరిలోకి దించుతోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులకు దీటుగా అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఈ విషయంలో మండల స్థాయి నాయకులతో పాటు, అవసరమైన చోట్ల గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి సర్పంచ్‌ అభ్యర్థుల విషయంలో గ్రామ కేడర్‌తో చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

కమలంలో యువ ఉత్సాహం

బలమైన అభ్యర్థులను బరిలో దింపుతున్న బీఆర్‌ఎస్‌

దీటైన అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషణ

పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు

మరోవైపు బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ గ్రామాల్లో అన్వేషిస్తోంది. గ్రామాల్లో యువత చాలా మట్టుకు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. యువ ఓటర్లలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు దీటుగా తమ పార్టీ నాయకులను సర్పంచ్‌ పదవికి పోటీలో నిలుపుతోంది. ఆ పార్టీకి చెందిన మండల నాయకులు, గ్రామస్థాయి నేతలు ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. మొత్తం మీద రాజకీయ పార్టీల గుర్తులకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండటంతో గ్రామ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement