పీఏసీఎస్ ప్రత్యేకాధికారి ఫయాజుద్దీన్
పెద్దశంకరంపేట(మెదక్): ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు పీఏసీఎస్ ప్రత్యేకాధికారి ఫయాజుద్దిన్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.2 కోట్ల 24 లక్షల లాంగ్‌టర్మ్ రుణాలు, రూ. కోటి వరకు వ్యవసాయ రుణాలను అందించామని తెలిపారు. ఇదే కాకుండా ఇతర రుణాలను అందిస్తున్నామన్నారు. రైతులు, సభ్యులు సంఘం అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ రవీందర్, సిబ్బంది సాయిరెడ్డి తదితరులున్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసుపై
ఏసీపీ విచారణ
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూరు గ్రామ కారోబార్ మల్లారపు రమేశ్‌ను కులం పేరుతో దూషించి దాడి చేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన కాసర్ల రమేశ్, కాసర్ల ప్రశాంత్‌పై పోలీసులు ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. మంగళవారం కేసు విచారణలో భాగంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం గ్రామాన్ని సందర్శించి ప్రత్యక్ష సాక్షులతో పాటు పలువురిని విచారించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉదయం గ్రామంలో పలువురు దళితులు రోడ్డుపైకి వచ్చి కారోబార్‌పై జరిగిన దాడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ మహ్మద్ ఆసీఫ్ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఆందోళన కారులతో మాట్లాడి నచ్చజెప్పారు.
ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు
చిన్నశంకరంపేట ఎస్‌ఐ
చిన్నశంకరంపేట(మెదక్): యువత ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ సీజన్ పేరిట నిర్వహించే ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. క్రీడలను వినోదంగా చూడాలి తప్ప, వ్యసనంగా మార్చుకోవద్దన్నారు. గ్రామాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను బిగ్‌స్క్రిన్ ద్వారా, ఈవెంట్‌గా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైన బెట్టింగ్ నిర్వహిస్తే ఫోన్‌చేసి సమాచారం అందించాలని సూచించారు.
సీజ్ చేసిన ఇసుక తరలింపు
పట్టుకున్న పోలీసులు
చిన్నశంకరంపేట(మెదక్): రాత్రికి రాత్రే సీజ్ చేసిన ఇసుకను తరలిస్తుండగా అధికారులు జేసీబీ, మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వివరాలు ఇలా... సోమవారం నార్సింగి గ్రామశివారులోని గుండుచెరువు వాగునుంచి అక్రమంగా తరలించి డంప్‌చేసిన ఇసుకను పోలీస్, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇసుక మాఫియా రెచ్చిపోయి రాత్రికి రాత్రే ఇసుక డంప్‌ను మరో చోటుకు తరలించేందుకు రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు అప్రమత్తమై ఇసుకను తరలిస్తున్న ఒక జేసీబీ, మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఇసుకను తరలించిన శాలిపేటకు చెందిన బుస్స రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సృజన తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం
సంగారెడ్డి క్రైమ్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని స్థానిక మహబూబ్ సాగర్ చెరువులో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి (45), మృతదేహం బయటకు తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు షార్ట్ ధరించి ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


