నిమ్జ్‌పై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

నిమ్జ్‌పై నజర్‌

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

భూసేకరణ వేగవంతం

సమస్యలు పరిష్కరించాలి: నిర్వాసితులు

ఇప్పటికే 7,200 ఎకరాల సేకరణ

మౌలిక వసతుల కల్పనపై దృష్టి

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మాన్‌ ఫ్యాక్చరింగ్‌ జోన్‌) భూసేకరణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తున్న నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఆయా గ్రామాల పరిధిలో సేకరించనున్న భూముల సర్వే వేగంగా సాగుతోంది. ప్రస్తుతం న్యాల్‌కల్‌ మండల పరిధిలోని ముంగి, రుక్మాపూర్‌, నామ్‌తాబాద్‌, డప్పూరు వంటి గ్రామాల్లో సర్వే, ల్యాండ్‌ రికార్డుశాఖ అధికారులు సర్వే పనులను చేపట్టారు.

12,635 ఎకరాల సేకరణే లక్ష్యంగా..

నిమ్జ్‌తోపాటు, కొడంగల్‌లో మల్టీ మాన్‌ఫ్యాక్చరింగ్‌ జోన్‌, వికారాబాద్‌లో ఈవీ పార్కు, వరంగల్‌–హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌, హైదరాబాద్‌ –బెంగళూరు కారిడార్‌ ఇలా పలు ఇండస్ట్రియల్‌ జోన్‌లను అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్న విషయం విదితమే. కాగా నిమ్జ్‌లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి దాదాపు దశాబ్దం దాటింది. విడతల వారీగా భూసేకరణ కొనసాగుతుండగా..ఇప్పుడు రెండో విడత సేకరణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. మొత్తం 12,635 ఎకరాలను సేకరించాలని లక్ష్యం ఉండగా, రెండో విడతలో 12 గ్రామాల పరిధిలో 8,500 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు భూసేకరణ ప్రక్రియ సుమారు 7,200 ఎకరాలకు చేరిందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సేకరించిన భూముల్లో మౌలిక వసతుల కల్పనపై పనులు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు టీజీఐఐసీ ద్వారా అవసరమైన విద్యుత్‌, రోడ్లు, నీరు, వంటి పనులు కొనసాగుతున్నాయి.

తమ సమస్యలు పరిష్కరించాకే నిమ్జ్‌లో పనులు ప్రారంభించాలని నిర్వాసిత రైతులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల న్యాల్‌కల్‌ మండలంలోని ముంగి తండా వాసులు నిమ్జ్‌ పనులను అడ్డుకున్నారు. అధికారులు తమ సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం భూసేకరణ ప్రక్రియపైనే కాకుండా, అధికార యంత్రాంగం నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement