ఎకరాకు 12 క్వింటాళ్లు..
ఏఈఓను సంప్రదిస్తే ఆన్‌లైన్‌లో నమోదు
నెల రోజుల ఇబ్బందులకు తెర
నారాయణఖేడ్: పత్తి కొనుగోలుపై కేంద్రం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇక ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలుకు సీసీఐకి అనుమతులు ఇచ్చింది. ఇప్పటి నుంచి ఆంక్షలు లేకుండా రైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయనుంది. గత ఏడాది 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ ఈ ఏడాది 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో సుమారు నెల రోజులపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో ఇబ్బందులు తొలగనున్నాయి. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడులు వచ్చినట్లు రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో సంబంధిత ఏఈఓలను సంప్రదిస్తే వారు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇలా నమోదు చేయించుకున్న అనంతరం రైతులు స్లాట్ బుక్ చేసుకొని తమకు కేటాయించిన తేదీన సంబంధిత మిల్లుకు తీసుకెళితే పత్తిని కొనుగోలు చేస్తారు. నేరుగా వెళితే 7క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తారు. దిగుబడులపై తప్పకుండా ఏఈఓలు లేదా ఏఓల ధ్రువీకరణ తప్పనిసరి. రైతులు వారిని సంప్రదిస్తే.. విచారణ జరిపిన వివరాలు ఉండటంతో సదరు రైతు చేనులో ఎంత దిగుబడి వచ్చిందనే అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో 3,48,372 ఎకరాల్లో పత్తి పంట సాగైంది.
దిగుబడిపై కలెక్టర్ల నివేదిక
ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొలుగోలు చేయాలని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ నివేదిక ఇవ్వగా.. దాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర జౌళిశాఖ ఆ మేరకే సేకరించాలని సీసీఐని ఆదేశించింది. ఈ నిబంధనలతో పత్తి రైతులు నెల రోజులపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే పంటలు దెబ్బతిని నష్టపోగా కేంద్రం నిబంధనలతో మరింత ఇక్కట్ల పాలయ్యారు. కొనుగోలుపై సమస్య ఉత్పన్నం కావడంతో రాష్ట్రంలో పత్తి సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లాల వారీగా సగటు దిగుబడులపై నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కలెక్టర్లను ఆదేశించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు నివేదికలు సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయని ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు నివేదిక అందజేశారు.
కపాస్ కిసాన్ యాప్‌తో ఇబ్బందులు
రైతులకు సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి దిగుబడి, తేమ శాతం, తరలించే మిల్లు తదితర వివరాలను నమోదు చేయాలి. ఈ విధానం రైతులకు భారంగా మారింది. ఫలితంగా ఇబ్బందుల దృష్ట్యా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్ముకుంటున్నారు. కపాస్ కిసాన్ యాప్‌ను తొలగించి పాత పద్ధతిలోనే పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పత్తి పంటకు ఎమ్మెస్పీ మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చెల్లిస్తున్నారు. రైతులు దళారులు రూ.6,500 నుంచి రూ.7వేల లోపే అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలుపై ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
పత్తి కొనుగోలుపై సీసీఐకి
అనుమతులిచ్చిన జౌళీ శాఖ


