పల్లెపోరుపై నిఘా
పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రచారంతోపాటు ఓటింగ్ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉత్పన్నమైన పక్షంలో హెల్ప్‌లైన్ నంబర్ 81253 52721కు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ వెల్లడించారు.
● రూ.50 వేలకు మించి నగదు తీసుకెళితే సీజ్ ● సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు ● హిస్టరీ షీట్లు ఉన్నవారికి బైండోవర్
ప్రశాంత ఎన్నికల కోసం అధికారుల చర్యలు
నారాయణఖేడ్: జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ సర్వైలైన్స్ టీం (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్‌ఎస్‌టీ) టీంలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ఈ బృందాలు నగదు రవాణా, మద్యం తరలింపు, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ వంటివి అడ్డుకోవడంతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోనున్నారు.
50 వేల లోపే నగదు తరలింపు
ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు రూ.50 వేల కంటే అధికంగా డబ్బును తరలించకూడదు, అలా తరలిస్తే అధికారులు డబ్బును సీజ్ చేస్తారు. ఒకవేళ రూ.50వేల కంటే అధికంగా నగదు తీసుకెళితే రశీదులు, సరైన ఆధారాలు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో చీరలు, మద్యం, ఇతర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా వాటి ఆధారాలు చూపించని పక్షంలో వాటిని సీజ్ చేస్తారు.
ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ తనిఖీలు
మండలానికి ఒకటి చొప్పున ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులను నియమించారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై వీరు స్పందిస్తారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టేందుకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. ఈ బృందంలో డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి, నగులు పోలీసులు, వీడియోగ్రాఫర్ ఉండి వాహనాల రాకపోకలపై నిఘా పెడతారు. జిల్లా సరిహద్దులోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోగల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. హిస్టరీ షీట్లు, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని ప్రశాంత ఎన్నికల దృష్ట్యా ముందస్తు బైండోవర్లు చేయనున్నారు. కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ మెసేజ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకాచం చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో 1,450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.
హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
పల్లెపోరుపై నిఘా


