లాభమా.. నష్టమా..! | - | Sakshi
Sakshi News home page

లాభమా.. నష్టమా..!

Nov 26 2025 11:04 AM | Updated on Nov 26 2025 11:04 AM

లాభమా.. నష్టమా..!

లాభమా.. నష్టమా..!

● గ్రేటర్‌లో మూడు మున్సిపాలిటీలు విలీనం ● తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారంలో చర్చ ● పన్నులు తప్ప ఒరిగిందేమి ఉండదని భావన ● నైరాశ్యంలో రాజకీయ నేతలు బొల్లారంలో ఆశ.. నిరాశ

● గ్రేటర్‌లో మూడు మున్సిపాలిటీలు విలీనం ● తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారంలో చర్చ ● పన్నులు తప్ప ఒరిగిందేమి ఉండదని భావన ● నైరాశ్యంలో రాజకీయ నేతలు

పటాన్‌చెరు/రామచంద్రాపురం(పటాన్‌చెరు): పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విలీన ప్రక్రియతో లాభమా.. నష్టమా అనే విషయమై బేరీజు వేసుకుంటున్నారు. ప్రగతి పరుగులు పెడుతోందని కొందరు వాదిస్తుండగా.. తమకు మాత్రం తీవ్ర నష్టం చేకూరుస్తోందని, తమ ఆశలు అడియాసలయ్యాని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళితే.. వెంటనే పరిష్కారమయ్యేదని, అదే జీహెచ్‌ఎంసీ అయితే అధికారులు దొరకడమే గగనమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా విలీనంపై అనేక భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మున్సిపల్‌ పాలక వర్గాల గుడువు ముగిసి దాదాపు రెండేళ్లు పూర్తి అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. గ్రేటర్‌ విలీనం కాకుండా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారనే చర్చ కూడా సాగింది. ఈ ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి లేదా గచ్చిబౌలి ప్రాంతంలోని ఇతర వార్డులను కలిపి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారనే చర్చ జరిగింది. కార్పొరేషన్‌ ఏర్పాటుపై స్థానిక నాయకులు ఎమ్మెల్యేతో గతంలో చర్చించారు. అన్ని ఊహాగానాలకు తెర దించుతూ ప్రభుత్వం ఆ మూడు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీన నిర్ణయాన్ని ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ పాలనలో పట్టణాల అభివృద్ధి అంత సాఫీగా జరగదనే అపప్రద ఈ ప్రాంతంలో నెలకొంది. పటాన్‌చెరును పంచాయతీ నుంచి గ్రేటర్‌లో కలిపినప్పటి నుంచి పౌరులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కాలంలో వేసిన రోడ్లు, ఇతర అభివృద్ధి తప్పితే కొత్తగా ఒరిగిందేమీ లేదనే చర్చించుకుంటున్నారు. ప్రజలపై పన్నుల భారం తప్పితే జీహెచ్‌ఎంసీలో విలీనంతో అభివృద్ధి కుంటుపడుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ చైర్మన్లు, కౌన్సిలర్లుగా ఉన్న నాయకులు తమ రాజకీయ భవితపై దృష్టి పెట్టారు. అయితే కాలనీల్లో కొత్త ఓటర్లు, సామాజిక స్పృహ ఉన్న ఇతర వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నేతల రాజకీయాలకు చెక్‌ పడే అవకాశం కూడా ఉంది. అమీన్‌ఫూర్‌, తెల్లాపూర్‌లలో గేటెడ్‌ కమ్యూనిటీలు ఇతర కాలనీ సంఘాల నేతలు క్రియాశీలంగా ఉంటూ కాలనీ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కొత్తగా విలీనమైన ఈ పట్టణాల్లో ఎన్ని కార్పొరేషన్‌ డివిజన్లు వస్తాయనే దానిపై స్పష్టత లేదు.

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70 వేల పైగా జనాభా ఉంటుంది. 2019లో పాలకవర్గం ఏర్పడింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి ఆధ్వర్యంలో 22 మంది కౌన్సిల్‌ సభ్యులతో మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏర్పడింది. రింగ్‌రోడ్డు లోపలున్న ఈ మూడు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తున్నట్లు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు క్షేత్రస్థాయిలో రంగానికి సిద్ధమయ్యారు. ఈ వార్త వారిని నిరాశకు గురిచేసింది.

స్థానికుల్లో ఆందోళన

తెల్లాపూర్‌ మున్సిపల్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక నేతల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. తెల్లాపూర్‌ మున్సిపాలిటీగా ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా విజయం సాధిస్తామని ఆయా పార్టీల కార్యకర్తలు ఐదేళ్లుగా అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంలో వారందరూ అయోమయంలో పడ్డారు. మున్సిపాలిటీగా ఉంటే 17 నుంచి 20మందికి పైగా కౌన్సిలర్లుగా ఉండే అవకాశం ఉంది. కానీ విలీనం కారణంగా ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని వాపోతున్నారు. సుమారు పదేళ్ల క్రితం విలీన ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ఆ సమయంలో నాటి జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిచిపోయిది. మళ్లీ తెరపైకి రావడంతో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement