మహిళాసాధికారతతోనే అభివృద్ధి
మంత్రి దామోదర రాజనర్సింహ
ఆందోల్‌లో వడ్డీ లేని రుణాల పంపిణీ
సంగారెడ్డి: మహిళా సాధికారతతోనే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందోల్ నియోజకవర్గంలోని 4,039 మహిళా సంఘాలకు రూ.4.52 కోట్లు, జిల్లాలో 15,909 సంఘాలకు మొత్తం రూ.18.25 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పావలా వడ్డీ రుణాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని గుర్తు చేశారు. అయితే గత పదేళ్లుగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల గురించిన మాటే లేకుండా పోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రూ.50 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుందని తెలిపారు.


