కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/కొండాపూర్(సంగారెడ్డి): కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను, నాయకులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుని రావాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని వెంకటేశ్వర గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వచ్చిన చోట కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైనా ఆర్థికంగా బలహీనంగా ఉంటే ఆ గ్రామానికి చెందిన ముఖ్యనాయకులు ఆ అభ్యర్థి విజయానికి పూర్తి సహకారం అందించాలన్నారు. నియోజకవర్గంలోని 84 గ్రామ పంచాయతీల్లో గెలిస్తే వారిని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి..ఆయా గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీఇచ్చారు.
సంగారెడ్డి నుంచి పోటీ చేయను
మరో మూడేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని జగ్గారెడ్డి మరోమారు స్పష్టం చేశారు.


