ఉజ్వల్ వైపే మొగ్గు!
● సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన దామోదర ● సంగారెడ్డి డీసీసీ పదవి విషయంపై చర్చ! ● రెండు, మూడు రోజుల్లో ప్రకటన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి పీటముడి వీడనుంది. ఈ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఉజ్వల్‌రెడ్డికే ఈ పదవి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అధినాయకత్వం నుంచి ప్రకటన వెలువడనుందని హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పదవి విషయంలో మొదటినుంచి ఉజ్వల్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఉజ్వల్‌రెడ్డిని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లిన దామోదర ఈ పదవి విషయంలో సీఎంతో ప్రత్యేకంగా చర్చించారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జునఖర్గేతో కూడా మంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డితోపాటు, పెండింగ్‌లో ఉన్న రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవులపై రెండు రోజుల్లో అధిష్టానం నుంచి ప్రకటన వెలువడనున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఉజ్వల్‌కు దామోదర బాసట
రానున్న రోజుల్లో ఎంతో కీలకంగా మారనున్న డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఉజ్వల్‌రెడ్డి వైపే మంత్రి దామోదర మొగ్గు చూపుతున్నారు. అనూహ్యంగా ఈ పదవి నియామకం విషయంలో అధినాయకత్వం ఈసారి అభిప్రాయ సేకరణ చేపట్టిన విషయం విదితమే. అన్ని జిల్లాల డీసీసీలను ప్రకటించిన అధిష్టానం సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను పెండింగ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒకవిధంగా మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రతిష్టాత్మక అంశంగా మారింది.


