నైట్‌డ్యూటీ వాచ్‌మెన్ హత్య
గజ్వేల్ పట్టణంలో ఘటన
గజ్వేల్‌రూరల్: వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గజ్వేల్‌లో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన అడెపు బాలయ్య(60)కు భార్య పుష్పతో పాటు నలుగురు కూతుర్లు ఉన్నారు. కూతుర్లకు వివాహాలు అయ్యాయి. బాలయ్య పట్టణంలోని పిడిచెడ్ రోడ్డులో వీమార్ట్‌లో ఐదేళ్లుగా నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి 8గంటలకు విధులకు వెళ్లిన అతడు మంగళవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు విషయాన్ని బంధువులకు చెప్పగా వారు వీమార్ట్‌కు వెళ్లి యజమాని కళాధర్‌ను అడిగారు. ఈ క్రమంలో బాలయ్యతో పాటు వీమార్ట్‌లో సెక్యూరిటీగార్డ్‌గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు రంజిత్, రితేశ్ సైతం కనిపించకుండా పోయారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మార్ట్ వెనుకభాగంలో వెతుకుతున్న క్రమంలో చెట్ల పొదల మధ్యన మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్‌స్కాడ్‌తో వివరాలు సేకరించారు. బాలయ్య గొంతుకు టవల్ బిగించి హత్య చేసి ఉంటారని, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో మృతుడు బాలయ్య కుటుంబ సభ్యులు, బంధువులు రంజిత్, రితేశ్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ గజ్వేల్–పిడిచెడ్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. సీఐ రవికుమార్ అక్కడికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


