పోలీసు అమరుల త్యాగం మరువలేం
● కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్
● అమరులకు నివాళులర్పించిన అధికారులు
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగం విస్మరించలేనిదని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఎస్పీతోపాటు అధికారులు హాజరై ఘనంగా నివాళులర్పించి అమరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పోలీస్ అంటేనే ధైర్యానికి చిరునామా అని, విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలు ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్య సాహసాలే కీలకమని చెప్పారు. అమరుల కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, సైదా నాయక్, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


