
చివరి గింజ వరకు కొంటాం
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం వరి ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మండలంలోని సంజీవన్‌రావుపేట, తుర్కపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో, నిజాంపేట్ మండలంలోని జంబికుంట, రాంరెడ్డిపేట్, మునిగేపల్లి గ్రామాల్లో కల్హేర్ మండలం మహదేవుపల్లి, నిజాంపేట మండలం రాంరెడ్డిపేట్, మునిగేపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. గతంలో క్వింటాల్‌కు 7 కిలోల వరకు తరుగుపేరిట తీసేవారని, ఇప్పుడు అలా జరగకూడదని ఆదేశించామని చెప్పారు. మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు జమ అవుతాయని వివరించారు.
బీఆర్‌ఎస్ పాలనలో కమీషన్లు
బీఆర్‌ఎస్ పాలనలో రైసుమిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకుని పనిచేశారని సంజీవరెడ్డి ఆరోపించారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ అలీ, నాయకులు దత్తుగౌడ్, సాయాగౌడ్, గౌస్‌చిస్తీ తదితరులు పాల్గొన్నారు.