
పోలీసుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జోన్: ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలందించే పోలీసుల ఆరోగ్య సంరక్షణే ప్రతీ ఒక్కరి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కొరకు నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జిల్లా వైద్యాధికారి నాగనిర్మల, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.