పత్తి విచ్చిన అప్పుల కత్తి! | - | Sakshi
Sakshi News home page

పత్తి విచ్చిన అప్పుల కత్తి!

Oct 23 2025 9:20 AM | Updated on Oct 23 2025 9:20 AM

పత్తి విచ్చిన అప్పుల కత్తి!

పత్తి విచ్చిన అప్పుల కత్తి!

దిగుబడి తగ్గిపోయిన పత్తి పంట ఎకరాకు ఐదారు క్వింటాల్‌ కూడా రావడం కష్టమే పెట్టుబడులు కూడా వచ్చేట్లు లేదంటున్న రైతులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి..కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నామమాత్ర దిగుబడులతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం కష్టమని, తమ రెక్కల కష్టం వృథా అయిందని ఆందోళన చెందుతున్నారు. కాగా, వ్యవసాయశాఖ మాత్రం ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే వాస్తవంగా ఆరు క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తితీత పనులు ప్రారంభించారు. దీపావళి పండుగ నుంచి ఈ పత్తి ఏరడం వేగవంతమవుతోంది.

3.48 లక్షల ఎకరాల్లో సాగు..

పత్తి పంటల అత్యధికంగా సాగయ్యే జిల్లాల్లో సంగారెడ్డి ప్రధానమైనది. ఈ పంట అత్యధికంగా సాగవుతున్న జిల్లాలో సంగారెడ్డి మూడో స్థానంలో ఉంటుంది. ఈ ఖరీఫ్‌ సీజనులో 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వ్యవ సాయశాఖ అంచనా వేసినట్లు ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున 3.48 లక్షల ఎకరాలకు సుమారు 2.79 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడులు వస్తాయని ఆశాఖ లెక్కలు వేసింది. ఈ సీజనులో ఈ మేరకు పత్తి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికార యంత్రాంగం భావిస్తోంది.

అధిక వర్షాలే కారణం..

ఈసారి ఖరీఫ్‌ సీజనులో భారీ వర్షాలు కురిశాయి. ఒకే రోజు 25 సెం.మీలకు మించి వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పత్తి చేలల్లో రోజుల తరబడి వరద నిలిచిపోయింది. దీంతో మొక్కలు చాలావరకు మురిగిపోయాయి. పత్తి మొక్కకు కింద భాగంలో ఉన్న పత్తికాయలు నీటిలో నానిపోయాయి. దీనీ ప్రభావం పత్తి దిగుబడిపై పడిందని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి కాయదశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు కురిశాయి. దీంతో పత్తి దిగుబడి తగ్గుతుందని రైతులు అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు దిగుబడి పూర్తిగా పడిపోవడంతో రైతులు అనుకున్నదాని కంటే ఎక్కువ దిగుబడి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వలస కూలీలు రాలే

ప్రతీ ఏటా వచ్చే వలస కూలీలు రామంటున్నారు. మీ దగ్గర దిగుబడి రావడం లేదు. మేము వచ్చి పత్తి తీసినా మాకు గిట్టుబాటు రాదంటున్నారు. ఇతర కూలీల కోసం ప్రయత్నం చేస్తున్నా.

– బగిలి బక్కన్న, తాటిపల్లి

పత్తితీతకు కూలీలేరి?

మునిపల్లి(అందోల్‌): పత్తీతీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్న కూలీలు సకాలంలో దొరకపొవడంతో చేతికొచ్చిన పత్తి నేల రాలిపోతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆటోల్లో ఉదయం వచ్చి సాయంత్రం 6 గంటలకే పత్తి తీసి వెళ్లే కూలీలు ఆటో కిరాయి రాను పోను ఇచ్చి కిలోకు రూ.13 చొప్పున ఇస్తామంటున్నా కూలీలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా వచ్చే వలస కూలీలు కొందరు ఈసారి కూడా వచ్చి ముందే పత్తితీత పనులు నిర్వహిస్తామని డబ్బులు తీసుకున్నారు. వారి సొంత గ్రామాలకు వెళ్లిన తర్వాత పత్తితీత పనులకు రావడం లేదని తీసుకున్న అడ్వాన్సు డబ్బులను సైతం తిరిగి పంపిస్తున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. పత్తితీత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఏం చేయాలో తోచక రైతులు దిగాలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement