
ఊపందుకున్న ఆలు సాగు
ఆకాశాన్నంటిన విత్తనం ధర ఏకకాలంలో పంట సాగయ్యే అవకాశం పంట దిగుబడులూ ఒకేసారిరానుండటంతో ధరపై ప్రభావం 3వేల ఎకరాల్లో పంట సాగుకానున్నట్లు అంచనా
ఇప్పటికే వర్షాలతో ఆలస్యమైన సాగు
విత్తన సబ్సిడీ లేదు
ఆలుగడ్డ విత్తనానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీని అందించడం లేదు. శీతల గిడ్డంగి ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే రైతులకు 40% మేర సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. రైతులు వ్యక్తిగతంగా లేక గ్రూపుగా వచ్చినా ఏర్పాటు చేసుకోవచ్చు. అధిక వ్యయం కారణంగా రైతులు ముందుకు రావడం లేదు.
– పండరీ, జిల్లా ఇన్‌చార్జి
ఉద్యానవన అధికారి, సంగారెడ్డి
జహీరాబాద్: జిల్లాలో ఆలుగడ్డ పంట విస్తృతంగా సాగవుతోంది. పక్షం రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో రైతులు భూములను దున్ని ఆలుగడ్డ పంట వేసే పనులు చేపట్టారు. దీంతో సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచే విత్తనం వేసుకునే పనులు ప్రారంభించేవారు. ఇటీవలి వరకు వర్షాలు కురవడంతో విత్తనం వేసుకునే పనులు ముందుకు వెళ్లాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు 3వేల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
జహీరాబాద్ ప్రాంతంలోనే 90% మేర సాగు
జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే 90% మేర పంట సాగుకానుంది. ప్రతి ఏటా రైతులు సంప్రదాయకంగా ఆలుగడ్డ పంటను సాగుచేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 10% మేర పంట సాగయ్యింది. ఎర్ర నేలల్లో మాత్రమే సాగువుతోంది. పాడు, రేగడి మట్టి కలిగిన భూములు ఇంకా దున్నడానికి వీల్లేకుండా చిత్తడిగా ఉన్నాయి. వర్షాల కారణంగా భూముల్లో అధికంగా తేమ కలిగి ఉండటంతో దున్నకానికి అనుకూలంగా లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంట సాగు డిసెంబర్ మొదటివారం వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. 80 రోజుల్లోనే పంట చేతికి అందివస్తుంది. వ్యవసాయ బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటంతో పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్ మండలాల్లో ఆలుగడ్డ పంట అధికంగా సాగుకానుంది.
ఆకాశంలో విత్తనం ధర
గతంతో పోల్చిచూస్తే ఈ ఏడాది ఆలుగడ్డ విత్తనం ధరలు ఆకాశంలో ఉన్నాయి. క్వింటాల్ ధర రూ.3,600లు పలుకుతోంది. ఇంతమేర విత్తనం ధర ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు మాత్రం క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 మేర అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఒకేసారి దిగుబడులతో
ధర పలికేనా!
రైతులంతా పంట సాగు ఒకేసారి చేస్తుండటంతో దిగుబడులు కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. దీంతో పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధరలు లభిస్తాయా లేదా అనే ఆందోళన రైతాంగాన్ని వెంటాడుతోంది. అయినా ఆలుగడ్డ పంట సాగువైపే రైతులు మొగ్గుచూపుతున్నారు.