
జోరుగా జూదం
విచ్చలవిడిగా బొమ్మ బొరుసు
జూదంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అలవాటు పడ్డ వ్యక్తులు ఇప్పుడు కొత్తగా బొమ్మ, బొరుసు ఆటకు తెరలేపారు. ఐదు నుంచి పదిమంది గ్రూపులుగా ఏర్పడి రహస్య ప్రదేశాలు, రాత్రి పొద్దు పోయాక ఆటలో నిమగ్నమవుతున్నారు. చీకట్లో క్యాండిల్స్, ఫోన్ టార్చ్‌లైట్ మధ్య బొమ్మ బొరుసు ఆడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఒక్క ఎనగండ్లలోనే ప్రతిరోజు 10 గ్రూపులు ఈ ఆట ఆడుతున్నట్లు సాక్షి నిఘాలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది అయితే తెల్లవారితే గాని ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బొమ్మ బొరుసు ఆటలో డబ్బులు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని రాత్రి పెట్రోలింగ్‌తోపాటు ఆట ఆడే వారు, వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
● బొమ్మ బొరుసుతో జేబులు ఖాళీ
● రాత్రి 10 దాటితే గుంపులుగా ఆట
● ఎనగండ్లలో వేలల్లో పందెం
● కానరాని పోలీసుల నిఘా!
కొల్చారం(నర్సాపూర్): జూదంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుస దాడులతో బెంబేలెత్తిన జూదరులు, ఇప్పుడు కొత్త ఆటకు తెర లేపారు. రాత్రి పది దాటితే గ్రూపులుగా ఎక్కడికక్కడ మొబైల్ లైట్ వెలుతురులో బొమ్మ, బొరుసు ఆడుతూ వేళల్లో పందెం కాస్తున్నారు. మండలంలోని ఎనగండ్ల గ్రామంలో ఆడుతున్నట్లు సాక్షి నిఘాలో వెల్లడైంది.
మండలంలో ఇటీవల రంగంపేట, ఎనగండ్ల గ్రామాల శివారులో విచ్చలవిడిగా జూదం ఆడిన చాలా కుటుంబాలు వీధిన పడిన ఘటనలున్నాయి. దీంతో ఆ కుటుంబాల సభ్యులు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో, ఎస్పీ ఆధ్వర్యంలో జూదం ఆట కట్టించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో జూదం ఆడుతున్న ప్రదేశాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సదరు జూదరులపై కేసులు సైతం నమోదు చేశారు. దీంతో గత నెల రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో జూదం తగ్గుముఖం పట్టింది.