
సాగు.. బాగు
వాణిజ్య పంట అయిన ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మార్కెట్‌లో వంటనూనెకు అధిక డిమాండ్ ఉండటంతో మన దేశంలో పండించేందుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.52 వేల సబ్సిడీతో ఒక్క రైతుకు 12 ఎకరాలకు వరకు ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
– మెదక్‌జోన్:
మెదక్ జిల్లాలో 5 లక్షల పైచిలుకు భూములుండగా వాటిలో సుమారు 4 లక్షల వరకు వరి, మరో 40 వేల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాగా మన దేశంలో వంటనూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ప్రతి ఏటా లక్ష కోట్లు వెచ్చించాల్సి వస్తోందని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ సాగుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించి ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నాయి. ఈ మేరకు ఎకరాకు రూ. 52 వేల సబ్సిడీ ఇస్తూ ఒక్కో జిల్లాకు టార్గెట్ పెట్టారు. దీంతో హార్టికల్చర్ అధికారులు రైతులను సాగుకు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు.
సబ్సిడీ ఇలా..
ఆయిల్ పామ్ పంట సాగు చేశాక 4 ఏళ్ల తరువాత పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు ఒక్క ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ. 52 వేల సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఎకరంలో 57 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క ధర రూ. 213 కాగా రూ.12,141 అవుతుంది. ఇందులో రైతు వాటాగా ఒక్కో మొక్కకు రూ. 20 చొప్పున 1,140 మాత్రమే చెల్లించాలి. మిగతా రూ. 11,001 సబ్సిడీని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. డ్రిప్ కోసం ఎకరాకు రూ.20 వేల సబ్సిడీ, ఏడాదికి ఎకరాకు రూ. 4,200 చొప్పున నాలుగేళ్లకు మొక్కల సంరక్షణకు 16,800, ఎరువులకు కలిపి మొత్తం ఎకరాకు నాలుగేళ్లలో రూ. 52 వేల సబ్సిడీ వస్తుంది.
2,500 ఎకరాలు టార్గెట్
ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1,300 ఎకరాల్లో సాగుకు రైతులు ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 530 ఎకరాల్లో సాగు పూర్తికాగా, ఇంకొందరు పంట సాగులో నిమగ్నమయ్యారు. కాగా ఒక్క రైతు 12 ఎకరాలకు మాత్రమే డ్రిప్‌పై సబ్సిడీ ఉంటుంది.
ఆయిల్‌పాం సాగుకు
అధిక సబ్సిడీ
ఎకరాకు రూ. 52 వేల ప్రోత్సాహం
40 ఏళ్లపాటు దిగుబడి
జిల్లాలో 530 ఎకరాల్లో సాగు
లక్ష్యం పూర్తి చేస్తాం
ఈ ఏడు జిల్లాకు 2,500 ఎకరాలు టార్గెట్ విధించారు. ఈ పంట సాగు చేసేందుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 530 ఎకరాలు పూర్తయింది. మార్చి వరకు లక్ష్యం పూర్తి చేస్తాం.
– ప్రతాప్‌సింగ్,
హార్టికల్చర్, జిల్లా అధికారి

సాగు.. బాగు