విరామమెరుగని బోధన
ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగ రాములు
హత్నూర(సంగారెడ్డి): పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు 80 ఏళ్ల వృద్ధాప్యంలో సైతం విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండల కేంద్రమైన హత్నూరకు చెందిన కోట గంగ రాములు 1968లో ఉపాధ్యాయుడిగా జిన్నారం మండలం శివనగర్ పాఠశాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించి.. 2004 ఏప్రిల్‌లో మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం గంగారం పాఠశాలలో పదవీ విరమణ పొందారు. అనంతరం బోరపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది సంవత్సరాలుగా ఉచితంగా తెలుగు బోధన చేశారు. దౌల్తాబాద్ పాఠశాలలో రెండేళ్లు, కొన్యాల పాఠశాలలో ఐదు నెలలు తెలుగు బోధించారు.
2011 నుంచి హత్నూర కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో 14 ఏళ్లుగా ఉచితంగా విద్యార్థినులకు తెలుగు బోధిస్తున్నారు. వద్ధాప్యంలో 9 ఏళ్ల క్రితమే భార్య లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. సంతానం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల పిల్లలనే తన పిల్లలనుకుంటున్నారు. ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వచ్చి పిల్లలతోనే భోజనం చేసి సాయంత్రం వరకు వారికి బోధిస్తున్నారు. 1999లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నుంచి అవార్డు సైతం అందుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నెల పెన్షన్ విద్యార్థుల అవసరాలకు, ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లకు కొంతమేర సహాయం అందిస్తానని గంగ రాములు తెలిపారు. 80 ఏళ్ల ఉచితంగ బోధిస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు.


