
ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి
● అటకెక్కిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు ● పథకం అమలుపై ఊసెత్తని ప్రభుత్వం
బీడు భూములకు ఎత్తిపోతల ద్వారా నీటిని అందించి వాటిని సస్యశ్యామలంగా మార్చాలనే సదుద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు అటకెక్కినట్లే అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాల ఊసే ఎత్తడం లేదు. ఈ పథకం పురోగతి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
జహీరాబాద్: జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా బసవేశ్వర పథకానికి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖేడ్‌లో భూమిపూజ చేశారు. జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల్లోని 11 మండలాలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. 2021లో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. 21 ఫిబ్రవరి 2022లో ఖేడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఆయా పథకాలకు గాను రూ.4,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రెండు ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి గాను 6,293 ఎకరాల భూమి అవసరం అవుతుందని, రూ.2,653 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు భూసేకరణ ప్రక్రియను మొదలు పెట్టలేదు.
కోర్టు పరిధిలో ఉన్నందునే జాప్యం
సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సంబంధించి డ్రాయింగ్, డిజైన్, అలైన్‌మెంట్ పనులకుగాను ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. వాటి పనులను పూర్తి చేసే పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఇతర పనులతో ముందుకు సాగుతాం. ఇంకా భూసేకరణ పనులు ప్రారంభించలేదు. ఈ పథకానికి సంబంధించి సంప్‌హౌజ్ ప్రాంతంలోని భూమికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నందున జాప్యం జరుగుతోంది.
– విజయ్‌కుమార్,
ఈఈ,నీటిపారుదల శాఖ, జహీరాబాద్
2.19 లక్షల
ఎకరాలకు సాగునీరు
జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాల్లోని 2.19లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రతిపాదించారు. అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 66 గ్రామాలకు చెందిన 65,816 ఎకరాలకు, సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 12 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగు నీటిని అందించేందుకుగాను బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద 8 టీఎంసీల నీటితో 1,65లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.1,774కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 14 జూన్ 2021లో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి అందోల్ నియోజకవర్గంలోని కంకోల్‌లో సంప్‌హౌజ్, 21 జూన్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన సంప్‌హౌజ్ నిర్మాణానికి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా పథకాలకు గ్రహణం పట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల విషయంలో గత 8నెలల క్రితం ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో జహీరాబాద్ ప్రాంత నేతల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.