
కోతల రోడ్డుకు మరమ్మతులేవి?
వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న సంగారెడ్డి–కామారెడ్డి సరిహద్దు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నప్రయాణికులు వాహనదారులకు తప్పని తిప్పలు
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి–కామారెడ్డి జిల్లాల మధ్య దూరాభారాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన సరిహద్దు రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్హేర్, పిట్లం మండల కేంద్రం మధ్యలో రోడ్డు బాగా దెబ్బతింది. దీంతోపాటు మహరాజు వాగు వద్ద రోడ్డు కోతకు గురైంది. మరికొన్ని చోట్లరోడ్డు ధ్వంసమైంది. వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది. రోడ్డు కోతకు గురైన చోట ద్విచక్రవాహనాలపై ప్రయాణించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు వెచ్చించి రోడ్డును మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బీటీ రెన్యూవల్ పనులు హుష్‌కాకి
బీటీ రెన్యూవల్ పనుల కోసం ఉన్న రోడ్డును తవ్వేశారు. తెల్ల కంకర వేసి రహదారి పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అర్ధంతరంగా పనులు నిలిపివేయడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. మరో పక్క నల్లవాగు వంతెన దగ్గర నుంచి కామారెడ్డి జిల్లా పరిధిలో పిట్లం వరకు మట్టి రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. మహరాజు వాగుపై నిర్మించిన వంతెన దెబ్బతిని ఇనుపచువ్వలు బయటకు వచ్చాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా పరిణమించింది.
ప్రమాదకరంగా మారింది
కల్హేర్, పిట్లం మండల కేంద్రాల మధ్యలో ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డు కోతకు గురైన చోట ప్రమాదకరంగా మారింది. వంతెన వద్ద రోడ్డు దెబ్బతినడంతో సర్కాస్‌ఫీట్లు తప్పడంలేదు. రోడ్డు బాగు పడితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. రోడ్డును వెంటనే మరమ్మతు చేసి పునరుద్ధరించాలి.
– నాగరాజు, కల్హేర్

కోతల రోడ్డుకు మరమ్మతులేవి?