
మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి
మెదక్ కలెక్టరేట్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వైజ్, కాంటినిజెంట్ వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైలీ వైజ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు దొడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. 212 జీఓను సవరించి 2014 నాటికి ఐదెళ్లు సర్వీస్ ఉన్న అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించడంతోపాటు పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొత్త మెనూ ప్రకారం పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికులను వేతనాలు పెంచాలన్నారు. విద్యార్థులతో పాటు కార్మికులకు రెండు జతల యూనిఫాం, ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. దీంతో పాటు కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సునంద, కోశాధికారి మాధవి, సలహాదారు శేఖర్, ఉపాధ్యక్షుడు సువర్ణ, సభ్యులు భూలక్ష్మి, జ్యోతి, పెంటమ్మ, రజిత, కిషన్, సురేష్, రమేష్ పాల్గొన్నారు.