అర్హుల కోసం స్క్రీనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అర్హుల కోసం స్క్రీనింగ్‌

Jul 18 2025 1:29 PM | Updated on Jul 18 2025 1:29 PM

అర్హుల కోసం స్క్రీనింగ్‌

అర్హుల కోసం స్క్రీనింగ్‌

● ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’ జాబితాపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ ● కొనసాగుతున్న అర్హుల తొలగింపు ప్రక్రియ ● విచారణ అనంతరమే పంపిణీకి ముహూర్తం

జహీరాబాద్‌: అర్హులైన పేదలందరికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కట్టబెట్టేందుకు రెవెన్యూ శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జాబితాలో కొందరు అనర్హులకు చోటు కల్పించారని వచ్చిన ఆరోపణల మేరకు ఇళ్ల పంపిణీని నిలిపివేశారు. తాజాగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేందుకు రెవెన్యూ శాఖ నడుం బిగించింది. మండలంలోని హోతి(కె) గ్రామంలో 660 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకువస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకుగాను అసంపూర్తిగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు అర్హులను గుర్తించారు. గుర్తించిన వారిలో అందుబాటులో ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లను సైతం పంపిణీ చేశారు. మిగిలిపోయిన వారిని వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్ల ఆధారంగా గుర్తించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేసినా లబ్ధిదారులందరినీ గుర్తించలేక పోయారు. దీంతో వారిస్థానంలో మిగతా వారి పేర్లను చేర్చి జాబితా తయారు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అప్పటి జాబితాల్లో ఉన్నవారిలో నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అనర్హుల జాబితాను సైతం సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ముందుగా అర్హులైన వారికి ఇండ్లను కేటాయించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

హామీతో ఆందోళన విరమణ

హోతి(కె) గ్రామ శివారులో నిర్మించిన 66 ఇళ్లు అసంపూర్తిగా ఉండటంతో లబ్ధిదారులకు తాళాలు అప్పగించలేదు. లబ్ధిదారులు ఆందోళన చేపట్టడంతో అధికార యంత్రాంగం దిగివచ్చి ఎట్టకేలకు ఈనెల 12వ తేదీ ముహూర్తం ఖరారు చేసింది. అయినా అప్పగించకుండా వాయిదా వేసింది. దీంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద, ఆర్డీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దీంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఇళ్ల పంపిణీకి మరోమారు తేదీని ఖరారు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అనర్హుల ఏరివేత

జాబితాలో అనర్హులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులు స్క్రీనింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రజలు అందించే ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదులు అందిన వారికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ అనంతరమే వారికి ఇళ్ల కేటాయింపు విషయాన్ని పరిశీలిస్తారు.

ప్రత్యేక కౌంటర్‌లో పేర్ల పరిశీలన

డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీని వాయిదా వేయడంతో లబ్ధిదారులు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి జాబితాల్లో తమ పేర్లు ఉన్నదీ లేనిది చూసుకుంటున్నారు. ఎక్కడ తమ పేర్ల గల్లంతవుతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారుల కోసం కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గతంలో మంజూరైన లబ్ధిదారుల జాబితాను అక్కడ అందుబాటులో ఉంచారు. సర్టిఫికెట్లను తీసుకువచ్చి సరిచూసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement